04-11-2025 09:36:01 PM
చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ శివారులో పిలాయిపల్లి కాలువకు గండి పడి రైతులు పండించిన పంట నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లాయి పల్లి కాలువకు గండి పడడంతో పంటచేలకు ఐదు రోజులుగా భారీగా వర్షపు నీరు చేరుతోంది. వరి పొలాలు పూర్తిగా నీట మునిగి పోయి కోతకొచ్చిన పంట కండ్ల ముందటే తడిసి ముద్దవ్వగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు పలుమార్లు అధికారులను సంప్రదించినా, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కాలువ గండి మూసివేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.