22-12-2025 11:57:20 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి(విజయక్రాంతి): డిసెంబర్ 23న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వనపర్తి జిల్లాలో పర్యటించి ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రముఖ కవులు, కళాకారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్ల పై దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్ర గవర్నర్ మంగళవారం మధ్యాహ్నం 4.00 గంటలకు వనపర్తి పట్టణంలోని ఐడిఒసి చేరుకొని పోలీస్ గౌరవ వందనం స్వీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల పై రూపొందించిన స్టాళ్ల సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమం, ఫోటో సెషన్ లో పాల్గొననున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. వనపర్తి జిల్లా నుండి రాష్ట్ర , జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ప్రముఖ కవులు, కళాకారులతో గవర్నర్ పరిచయ కార్యక్రమం ఉన్నందున అట్టి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్డీఓ సుబ్రమణ్యం ను ఆదేశించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, కలెక్టరేట్ ఎ. ఒ భాను ప్రకాష్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.