calender_icon.png 23 December, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలి

23-12-2025 12:00:00 AM

బంగ్లాదేశ్‌లో హిందువు హత్యను నిరసిస్తూ హస్తినాపురంలో బీజేపీ శ్రేణుల ఆందోళన 

ఎల్బీనగర్, డిసెంబర్ 22: హిందువుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో  హిందూ వ్యక్తిని బతికుండగానే హింసించి కాల్చి చంపిన ఘటనను నిరసిస్తూ ఆదివారం రాత్రి హస్తినాపురంలో బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశంలో కొన్ని పార్టీలు సెక్యులర్ ముసుగులో హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ తీవ్రవాదానికి సహకరిస్తున్నారని ఆరోపించారు.

హిందువులకు భారత దేశమే ఒక్కటే ఉందని, హిందువులపై జరిగే ప్రతి దాడి అన్ని మతాల వారు ఖండించాలని కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కొన్ని సంవత్సరాలుగా హిందువులపై  హింసాత్మక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  బంగ్లాదేశ్ హిందువుల ప్రాణాలకు భద్రత కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.