23-07-2025 12:35:51 AM
న్యూఢిల్లీ, జూలై 22: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే ఆంశంపై మంగళవారం సుప్రీంలో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఇది ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన ఆంశం కాదని మొత్తం దేశానికి సంబంధించిన ఆంశమని ధర్మాసనం పేర్కొంది. ఇక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసినా సీబీఐ హాజరుకా కపోవడంతో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చినా వారు హాజరుకాకపోవడమేంటని సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసును 30వ తేదీకి వాయిదా వేసింది.
ఉన్నత విద్యనభ్యసించి అడుక్కుంటావా: సీజేఐ
తన భర్త నుంచి భరణంగా రూ. 12 కోట్లు, బీఎండబ్ల్యూ కారు డిమాండ్ చేసిన మహిళ కోరిక విని సీజేఐ బీఆర్ గవాయ్ అవాక్కయ్యారు. ఆ మహిళ ఉన్నత విద్యనభ్య సించి ఉండటంతో ఏమైనా పని చేసుకోవాలని, 18 నెలల దాంపత్య జీవితానికే రూ. 12 కోట్లతో పాటు, బీఎండబ్ల్యూ కార్ ఇవ్వాలా అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు.
తన భర్త నిరాధార ఆరోపణలు చేస్తూ కేసు లు పెట్టడంతో తన ఉద్యోగం పోయిందని ఆ మహిళ వాపోయింది. అప్పుడు గవాయ్ స్పందిస్తూ నీమీద ఫైల్ అయిన కేసులన్నీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఐటీ కేంద్రాలైన బెంగళూరు, పూనే, హైదరాబాద్ వంటి నగరాల్లో ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని సూచించారు.