calender_icon.png 18 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్వస్థ్ నారీ’ మెగా వైద్యశిబిరం ప్రారంభం

18-09-2025 12:36:36 AM

ములకలపల్లి,/దమ్మపేట, సెప్టెంబర్ 17, (విజయక్రాంతి)ములకలపల్లి మండలం మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ ,చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆరోగ్య కేంద్రంలోని రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గిరిజన మహిళలతో కోయ భాషలో మాట్లాడుతూ, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను వినియోగించుకొని మహిళలు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలకు విద్య అత్యంత ముఖ్యమని, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని వాటిని వినియోగించుకొని అభివృద్ధి సాధించాలన్నారు.

అనంతరం మండలం పరిధిలోని మూకమామిడి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఘన స్వాగతం పలికిన ఈ సందర్భంగా మంత్రి తరగతి గదులు, సంగీత గది పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 ఏకలవ్య పాఠశాలలు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధి కోసం 8 పాఠశాలలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

విద్యార్థులకు హెల్త్ కార్డులు అందజేసి ఆరోగ్య వివరాలు నమోదు చేసే విధానాన్ని అమలు చేయడం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆలోచనలో భాగమని పేర్కొన్నారు.విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి రహదారులు కీలకమని, జిల్లాలో రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మూకమామిడి ప్రాజెక్టు సమయంలో పది ఎకరాలు కేటాయించడం ద్వారా ఈ పాఠశాల ఏర్పాటు సాధ్యమైందని వివరించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రీడా సామాగ్రి అందించి వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.జిల్లా ఖ్యాతి పెంచే విధంగా దేశంలోనే మొట్టమొదటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపించామని, దీని ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

ఏకలవ్యుడి ఏకాగ్రత, పట్టుదలను ఆదర్శంగా తీసుకుని ఈ పాఠశాల దేశానికి మోడల్గా నిలవాలని పిలుపునిచ్చారు. అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ , నేను సైతం చేయుట కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.1.75 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిలో పాఠశాల భవనాలు, వసతి గృహాలు, ఆవరణ గోడలు, తాగునీటి సదుపాయాలు, రహదారుల మెరుగుదల వంటి పనులు ఉన్నాయని వివరించారు.

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం తరగతి గదులు, లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడా సామాగ్రి వంటి సౌకర్యాలను విస్తృతంగా కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువులో మాత్రమే కాకుండా క్రీడలు, సాంకేతిక రంగాల్లోనూ రాణించాలని సూచించారు.

గిరిజన విద్యార్థుల అభివృద్ధి, సాధికారత ద్వారా గ్రామాలు, జిల్లా, రాష్ట్రం మొత్తానికి మేలుకలుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలిసి ప్రతి చర్యను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, పూర్వంలో విద్యార్థులకు సదుపాయాలు లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం విద్య ప్రమాణాలను పెంచే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 

దమ్మపేటలో...

తదుపరి దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో రూ.8.60 కోట్ల వ్యయంతో వసతి గృహాలు, తరగతి గదులు, ప్రహరీ గోడ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, కొత్తగా నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. అద్వంత ఎంట్ర్పజెస్ సహకారంతో రూ.46 లక్షలతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు.

విద్యార్థులకు ఆట మైదానం, క్రీడా సామాగ్రి త్వరగా అందించాలని, నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.