calender_icon.png 18 August, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొండిగోడల్లో తహసీల్దార్ కార్యాలయం

18-08-2025 12:02:54 AM

  1. రెండేళ్లుగా సా...గుతున్న భవనం

నిధులు మంజూరైన నిర్మాణంలో జాప్యం 

అవస్థలు పడుతున్న రైతులు, ప్రజలు 

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 17 (విజయక్రాంతి):అంగట్లో అన్ని ఉన్న.... అల్లుని నోట్లో అన్నట్లు ఉంది గుండాల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం నిర్మాణం. నిధులు మంజూరైన నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. రెండేళ్లుగా తాసిల్దార్ భవనం అసంపూర్తిగా ఉండటంతో కార్యాలయానికి వస్తున్న ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని మారుమూల గిరిజన ప్రాంతమైన గుండాల మండలం. భూ సమస్యలు, ఇతరాత్ర సర్టిఫికెట్లు నిమిత్తం తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండల వ్యవస్థ ఏర్పాటు రోజుల్లో నిర్మించిన తాసిల్దార్ కార్యాలయం అసౌకర్యంగా ఉందని రెండు సంవత్సరాల క్రితం పాత భవనాన్ని కూల్చివేసి, నూతన భవనానికి శ్రీకారం చుట్టారు.

తాత్కాలికంగా తాసిల్దార్ సమీపంలో గల వ్యవసాయ శాఖ కార్యాలయంలో, తాసిల్దార్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇరుకు గదుల కారణంగా కంప్యూటర్లు, టేబుళ్లు, బీరువాలో పెట్టేందుకు కూడా ఆ గదులు సరి పోకపోవడంతో, వివిధ పనుల మీద కార్యాలయానికి వచ్చే ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా అధికారుల పర్యటన సందర్భంలోనూ కూర్చోవడానికి కూడా అనువుగా లేక, బయటనే ప్రజలతో మాట్లాడం విశేషం.

రెండేళ్ల క్రితం కార్యాలయ నిర్మాణానికి రూ 50 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో పనులు చేపట్టారు. మంజూరైన నిధుల కు సరిపడ కాంట్రాక్టర్ నిర్మాణం పనులు పూర్తి చేశారు. వాటితో బేస్మెంట్, పిల్లర్స్ ఒక గదికి స్లాబ్ నిర్మించి నిధుల్లో సరిపోక అసంపూర్తిగా నిలిపివేశారు. మరో విడత నిధుల కోసం వేచి చూడగా ఇటీవల కాలంలో డి ఎం ఎఫ్ టి నిధులు రూ 65 లక్షలు మంజూరు చేశారు.

నిధులు మంజూరైన నిర్మాణం మాత్రం ముందుకు సాగటం లేదు. తాజాగా మంజూరైన నిధులతో అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు టెండర్లు పిలవడం జరిగింది. వారం రోజుల క్రితం టెండర్లను ఖరారు చేశారు. తక్షణమే పనులను వేగవంతం చేసి తాసిల్దార్ కార్యాలయాన్ని సకల సౌకర్యాలతో పూర్తి చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అగ్రిమెంట్ పూర్తికాగానే పనులు ప్రారంభిస్తాం: పంచాయతీ రాజ్ డీఈ రామనాథం 

తహసీల్దార్ కార్యాలయం అసంపూర్తి పనులకు ఇటీవలనే టెండర్లు పూర్తయ్యాయి. స్థానిక కాంట్రాక్టర్ పనులను దక్కించుకున్నారు. అగ్రిమెంట్ పూర్తి చేసి పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తాం.