15-05-2025 11:38:18 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులను ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కూరగాయల మార్కెట్ ను వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు(Municipal Commissioner Srinivas Rao)తో కలిసి సమీకృత మార్కెట్లోని షాపుల కొరకు లబ్దిదారులకు లక్కీడ్రా నిర్వహించారు. లబ్ధిదాలను లక్కీ పద్ధతిలో ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... సమీకృత కూరగాయల మార్కెట్లోని 31 షాపులకు నిర్వహించిన లక్కీడ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్లో ఫ్లాట్ఫామ్లు, షాపులతో పాటు కూరగాయలు, ఉత్పత్తులను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించామన్నారు. ఈ క్రమంలో షాపులు పొందిన వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం నిర్వహిస్తూ వినియోగదారులకు అవసరమైన కూరగాయలు, మాంసపు ఉత్పత్తులను విక్రయిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. షాపులు పొందిన లబ్దిదారులు తామే ఆయా షాపులను నిర్వహించాలని, మార్కెట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. లక్కీ డ్రాలో వ్యాపారులు, అధికారులు పాల్గొన్నారు.