21-06-2025 07:56:25 PM
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్..
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అంగన్వాడీలలో వసతుల కల్పనకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీలు చిన్నారుల కోసం ప్రాథమిక విద్య కేంద్రాలుగా పనిచేస్తున్నందున, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చెందేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ప్రతి అంగన్వాడీలో ఆకర్షణీయమైన పెయింటింగ్స్, ఆటబొమ్మలు ఏర్పాటు చేసి పిల్లలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని చెప్పారు. నాణ్యమైన, రుచికరమైన ఆహారం క్రమం తప్పకుండా అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ పరిశుద్ధ్యాన్ని పాటించాలని సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వర్షాకాలంలో చిన్నారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సిడిపిఓలు నాగమణి, నాగలక్ష్మి, సరిత, సమన్వయకర్త నిరంజన్ రెడ్డి, మండలాల పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.