16-05-2025 12:27:50 AM
నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. విభిన్న పాత్రలతో అభిమాన ధనాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు మరో గొప్ప పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు! చిత్ర పరిశ్రమ భారతీయ సినీ పితామహుడిగా కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రాజెక్టు వెనుక రాజమౌళి, కార్తికేయ, వరుణ్ గుప్తా (మ్యాక్స్ స్టూడియోస్) ప్రమేయం ఉందన్న టాక్ వినవస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం కాగా, అది విన్న జూనియర్ ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఈ ప్రాజె క్ట్ చేసేందుకు ఒప్పుకున్నారట. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే సినిమాను మేకర్స్ ప్రకటించారు.
ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్ కక్కర్ మూవీని తెరకెక్కించబోతున్న విషయాన్ని అప్పుడే వెల్లడించారు. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్‌లో ఎన్టీఆర్ నటిస్తారంటూ ముంబయి మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫాల్కే గెటప్‌లో తారక్ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే గతంలో ఈ ప్రాజెక్టులో ఆమిర్‌ఖాన్ నటిస్తారంటూ గతంలో వార్తలొచ్చాయి.