calender_icon.png 22 January, 2026 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబంధ హస్తాల నుంచి సింగరేణి సంస్థను రక్షించుకుంటాం

22-01-2026 12:36:02 AM

సింగరేణి హెడ్ ఆఫీస్ ధర్నాలో  టీబీజీకే ఎస్ నేత నాగేల్లి  

మణుగూరు, జనవరి 21 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ మనుగడను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతున్నదని, టీబీజీకేఎస్ నేత నాగేల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్‌ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగేల్లి మాట్లాడుతూ,సింగరేణి సంస్థను బలోపేతం చేస్తామని కొత్త బావులు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సింగరేణిని గ్లోబల్ సంస్థగా విస్తరించి కీర్తి ప్రతిష్టలు  పెంచుతామన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు సింగరేణిని సంస్థను చెదపురుగుల్లా పట్టి పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరొక మంత్రి కలిసి సింగరేణిలో సైట్ విజిట్ విధానాన్ని ప్రవేశపెట్టి తమ బంధువులకు, శ్రేయోభిలాషులకు సింగరేణి సొమ్మును దోచి పెట్టేందుకు తెరలేపారని విమర్శించారు. సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వ జోక్యం తగ్గించుకోవాలని సైట్ విజిట్ విధానంతో పిలిచిన టెండర్లను అన్నింటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థను కాపాడుకునేందుకు ప్రతి కార్మికుడు  ముందుకు కదలాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వరరావు సుద్దాల సంపత్ కుమార్, పీక నాగరాజు, మురళీకృష్ణ, జంగం రాజ్ కుమార్,గుగులోత్ రమేష్ నాయక్, దాసుమల్ల ప్రవీణ్, పడ్డం శ్రీనివాస్, మస్తాన్, పడ్డం రవి, నరేందర్, శ్రీహరి, ప్రభాకరరావు  పాల్గొన్నారు.