19-07-2025 12:00:00 AM
ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
పెబ్బేరు జూలై 18 : విద్యార్థుల విషయం లో ఉపాధ్యాయులు ఇంకా కృషి చేయాలని అప్పుడే ప్రభుత్వ విద్యపై విశ్వసనీయత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ను, బిసి వసతి గృహంలో శుక్రవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులను పరిశీలించారు. అనంతరం వారి గణిత శాస్త్ర ప్రావీణ్యం పై పరీక్షించారు.
మానసికంగా ధృఢంగా ఉండాలని, చదవాలనే సంకల్పం గట్టిగా ఉండాలని అప్పుడే విజయం సునాయాసంగా ఉంటుందని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు నోటుపుస్తకం బహూకరించారు. అనంతరం ఎంఈఓ జయరాములు, ఉపాధ్యాయులకు గట్టిగా సూచనలు చేశారు. విద్యార్థులకు సరైన నైపుణ్యం సాధించకపోతే ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం స్థానిక బిసి సంక్షేమ వసతి గృహంలో తనిఖీ చేసారు. వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యంత దయనీయంగా సౌకర్యాలు ఉన్నాయని, తక్షణమే సౌకర్యాలు మెరుగుపర్చాలి అని ఆదేశించారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది అని అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఖాజాహరీఫుద్దీన్ కు తక్షణమే సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని ప్రాధాన్యత కలిగిన సౌకర్యాలు కల్పించాలని అప్పుడే వారినుంచి మనం మంచి చదువు తో పాటు ఫలితాలు ఆశించవచ్చని తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని లేనిచో, ఆయా అంశాల ఉపాధ్యాయుడి ని, ప్రధానోపాధ్యాయున్ని బాధ్యులుగా పరిగణనలోకి తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, తహసీల్దార్ శ్రీమంతుల మురళి గౌడ్, ఇన్చార్జ్ ఎంపీడీవో రోజా, ఏఎంఓ మహానంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.