18-11-2025 12:06:37 AM
తెలంగాణలో ప్రకటించిన టెట్ సిలబస్‌పై రాష్ర్ట వ్యాప్తంగా టీచర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ బోధనా రంగానికి సంబంధం లేని సబ్జెక్టుల నుంచి పెద్దమొత్తంలో ప్రశ్నలు రావడం ఆందోళనకు గురిచేస్తోందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా 20 సంవత్సరాల క్రితమే చదువు వదిలేసి ప్రభుత్వ ఉద్యోగంలో బిజీగా ఉన్న టీచర్లు మళ్లీ ఆ సబ్జెక్టులు చదవడం ఇబ్బందిగా మారింది. గతంలో వారి ట్రైనింగ్, పోస్టుల ఆధారంగా సిలబస్‌ను రూపొందించగా, ఇప్పుడు సాధారణీకరించిన పద్ధతితో అందరికీ ఒకే సిలబస్ పెట్టడంతో గందరగోళం పెరిగింది.
ఇంగ్లిష్, బయాలజీ, ఫిజిక్స్ చదివిన వారికి గణితంలో ప్రశ్నలు ఇవ్వడం ఇబ్బందిగా మారింది. వాళ్ల అసలు సబ్జెక్టుకు వర్తించే ప్రశ్నలు కేవలం 12 మార్కు లు మాత్రమే ఉండగా, మిగతా 90 మార్కులు పూర్తిగా సంబంధం లేని సబ్జెక్టుల నుంచి రావడం అన్యాయమని వాపోతున్నారు. ఈ అసమానత కారణంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టమవుతుంది. శిక్షణ పొందిన తమ అసలు ప్రత్యేకతను ప్రశ్నించే విధంగా సిలబస్ రూపకల్పన ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో సబ్జెక్ట్ నిష్ణాతులు కూడా పాస్ అవడమే సవాల్‌గా మారుతుందని టీచర్లు ఆవేదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిల బస్‌ను సబ్జెక్టుల వారీగా విభజించి, ఆయా టీచర్లు బోధించే సబ్జెక్టుకు అనుగుణంగా టెట్ నిర్వహించాలని కోరుతున్నారు. విద్యా నాణ్యత పెంచాలన్న ఉద్దేశ్యం మంచిదైనా, ప్రస్తుత సిలబస్ టీచర్ల వృత్తిపర నైపుణ్యాన్ని పట్టించుకోకుండా రూపొందించబడింది.
దీనిపై ప్రభుత్వం పునర్విమర్శ చేసి, సంబంధిత సంఘాలతో చర్చించి, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సిలబస్‌లో మార్పులు చేయాలని టీచర్లు కోరుతున్నారు. టెట్‌లో సమూల మార్పులు చేయాలి. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వాటితో ప్రశ్నాపత్రాలు పొందుపరచాలి. అందరికీ 35 మార్కులను పాస్ మార్కులుగా నిర్ణయించాలి. పరీక్ష ఫీజును కూడా తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సతీశ్ రెడ్డి, భూపాల్ పల్లి