18-05-2025 10:02:42 AM
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(Satish Dhawan Space Centre) మొదటి ప్రయోగవేదిక నుంచి ఈరోజు ఉదయం 5:59గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ 61(PSLV-C61) ప్రయోగాన్ని నిర్వహించారు. కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ 61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఇస్రో చేపట్టిన 101వ ప్రయోగం మూడో దశలో సాంకేతిక సమస్య ఎదురైందని, విశ్లేషణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో ఛైర్మన్ నారాయణన్(ISRO Chairman Narayanan) తెలిపారు.
ఈవోఎస్ ప్రత్యేకతలు..
ఈవోఎస్-09 ఉపగ్రహం దాదాపు 1,696 కిలోగ్రాముల బరువు ఉంది. పీఎస్‌ఎల్‌వీ సీ 61(PSLV-C61) ప్రయోగం దాదాపు 17 నిమిషాల్లో పూర్తికానుంది. ఈ ఉపగ్రహం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనపైనా రాత్రి, పగలు తేడా లేకుండా భూమి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించగలదు. ఇందులో అత్యాధునికమైన సీ బ్యాండ్‌ను అమర్చారు. సీ బ్యాండ్ అంటే సింథటిక్ అపార్చర్ రాడార్(Synthetic aperture radar). ఈ వ్యవస్థను శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహంలో అమర్చారు.
ఈ ఉపగ్రహంలో 5 విభిన్న ఇమేజింగ్ మోడ్‌లు ఉన్నాయి. అత్యంత చిన్న వస్తువును కూడా గుర్తించగల అల్ట్రా హై రెజల్యూషన్ ఇమేజింగ్(Ultra high resolution imaging) నుంచి విశాలమైన ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడే బ్రాడర్ స్కాన్స్ కూడా దీనిలో అమర్చి డిజైన్ చేశారు. ఇప్పటిదాకా ఉన్న ఈవోఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్‌ను అమర్చి పంపిస్తున్నారు.