23-10-2025 01:43:49 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ అక్టోబర్ 22 (విజయక్రాంతి); రైతుల భూ సమస్యల పరిష్కారానికి తహసిల్దార్లు క్షేత్రస్థాయికి వెళ్లి, గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నవంబర్ 1 నుండి 30 వరకు గ్రామాల వారీగా భూ సమస్యల పరిష్కార కార్యక్రమం చేపట్టి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అన్ని దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు.
రెవెన్యూ అంశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అటవీ అధికారి రోహిత్ గోపిడి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వాస్తవాలకు భిన్నంగా ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లు తదితరులుపాల్గొన్నారు.