10-12-2025 12:00:00 AM
జూకంటి జగన్నాథం :
ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ
* తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, సంగీత వారసత్వం.. భద్రాచలం రామదాసు నుంచి గద్దర్ మీదుగా అందెశ్రీ వరకు.. దాశరధి, కాళోజీ నుంచి సినారె వరకు ఒక జానపద సాహిత్య సంగీత ఎరుక కలిగి ఉన్నది. తెలంగాణ అత్యున్నతమైన ప్రజల వారసత్వ సంపద మన సొంతం.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు,
తెలంగాణ రాష్ర్టం..
అయ్యా! శతకోటి నమస్కారాలు. తెలంగాణ ఆత్మగౌరవంతో నేరుగా మీకు రాస్తున్న బహిరంగ లేఖ ఏమనగా.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు.. మీ తిప్పలు, మీ హామీల అమలుపై చేస్తున్న తాత్సారాలు, వేస్తున్న వాయిదాలు, మీ పాలసీలు అన్నింటినీ తెలంగాణ మేధావు లు, కవులు, రచయితలు, ప్రజలు అర్థం చేసుకొని సంయమనంతో, సహనంతో ఇంతకాలం మీకు సహకరిస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవల తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య రంగాలపై మీ వైఖరి, ధోరణి, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు.. తెలంగాణవాదులకు, కవులకు, రచయితలకు, మేధావులకు ఎంత మాత్రం సమ్మత ము అలాగే హర్షనీయం కాదు. సాహిత్య, సంస్కృతి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పట్ల ఒక స్పష్టత ఉండాలని.. మీ నుంచి ఒక స్పష్టత వస్తుందని ఆశించా ము. కానీ మీరు కూడా గత ప్రభుత్వం లాగే ప్రతి సంఘటన నుంచి, సమావేశం నుంచి రాజకీయ ఫాయిదా ఎలా ఉటాయించాలని చూస్తున్నారు తప్ప మరో ప్రత్యామ్నాయంగా నిరూపించుకునే ప్రయత్నం కనబడడం లేదు.
పునరాలోచన అవసరం..
రాజకీయ చతురతతో, వాగ్దానాడంబరాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలంగాణ అస్తిత్వం సాహిత్య, సంగీతాల వారసత్వ కొనసాగింపుపైన ఒక స్పష్టత లేకపోవడం శోచనీయం. ఆ విషయంపై అవగాహన రాకపోవడం బాధాకరం. ఇది మీకు తెలిసి జరిగినా, తెలియక జరిగినా దీనిపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరముంది. తెలంగాణ సాహిత్య సంస్కృ తులతో చెలగాటమాడడమంటేనే ‘సూదిని ముల్లె కట్టినటే’్ట అని గ్రహించవలసిన అవసరం ఏర్పడినది.
ప్రస్తుతం ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రవీంద్ర భారతి ప్రాంగణంలో సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్ర మణ్యం విగ్రహానికి వేసిన ముసుగును అనతి కాలంలో మీరు తొలగించబోతున్నారని తెలిసి ఆవేదనతో మీ దృష్టికి ఈ కింది విషయాలను తీసుకొస్తున్నాను.
తెలంగాణ సంగీతం..
తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, సం గీత వారసత్వం.. భద్రాచలం రామదాసు నుంచి గద్దర్ మీదుగా అందెశ్రీ వరకు.. దాశరధి, కాళోజీ నుంచి సినారె వరకు ఒక జానపద సాహిత్య సంగీత ఎరుక కలిగి ఉ న్నది. తెలంగాణ తనదైన అత్యున్నతమైన ప్రజల అమూల్య వారసత్వ సంపద మన సొంతం. సరిగమలు మనవి కావు. మనదంతా మౌఖిక సాహిత్యం. అప్పటిదప్పు డు కైకట్టి, కాళ్లకు గజ్జె కట్టడం, డప్పు కొ ట్టడం, దరువు వేయడం, తుడుము ఊద డం, బాగోతం, చిరుతల రామాయణం కాలం ఎటమటమైనప్పుడు పట్టపగలు
పటం కథలు చెప్పడం, జంబిడిక వాయించడం, తాంబూర మీటడం లాంటి తదితర సంగీత కళలు నేర్చిన గడ్డ ఇది. అంతేకాదు అమూల్య ప్రజల శ్రమ నుంచి పాట పుట్టి.. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, వేములవాడ రాజన్న, యాదగిరి నరసన్న, ఆదివాసుల సమ్మక్క సారక్క పండుగలు జాతరలకు తదనుకూలంగా సంగీతం తోడైనది.
సమాదరణ ఎక్కడ?
ఈ విషయం పల్లెటూరు నుంచి వచ్చిన మీకు కూడా బాగా తెలిసినదే. ఇతరేతరులకు మృగ్యమైన తెలంగాణ గర్వించే ఆత్మ గౌరవం, జానపద, సంగీత, సాహిత్య అపురూప విద్వత్తు సంపద మనకు మాత్రమే సొంతం. అందుకని గౌరవనీయులు ము ఖ్యమంత్రి గారు అసలు రవీంద్రభారతిలో బాలసుబ్రమణ్యం విగ్రహం ఆవిష్కరణను మీరు గానీ, మీ ప్రభుత్వం గానీ చేయడం ఒక చారిత్రక తప్పిదంగా మిగిలిపోనుంది.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి అనేకమంది నిఖార్సైన తెలంగాణ వాదులు, కవులు, రచయితలు, మేధావులు, తీవ్ర మనస్తాపానికి లోనవుతున్నారు. ఈ విషయమై పునరాలోచన చేయవలసిన తక్షణ ఆవశ్యకత ఉన్నది. మీరు, మీ సహచర నాయకులు.. ‘సంగీతానికి ఎల్లలు లేవు.. ప్రాంతాలు లేవు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటే అవన్నీ సమర్ధింపులుగానే ఉంటాయి తప్ప తెలంగాణ సమాజానికి ఏమాత్రం శోభితం, శ్రేయస్కరం కాదని మీకు మనవి చేస్తున్నాను.
ఈ సందర్భంగా అసలు తెలంగాణ ఉద్యమం మూలమే నీళ్లు, నిధులు, నియామకాలు కన్నా ముం దు సంస్కృతి, భాష వివక్షల కాంక్ష నుంచి తెలంగాణ రాష్ర్ట ఆకాంక్ష ఉద్యమంగా కొనసాగింది.. అనే సత్యాన్ని పాలకులు, పాలితులు తెలుసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. సినీ గాయకులుగా ఘంటసాల, బాలసుబ్రమణ్యంపైన మాకు గౌర వం ఉంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పడ్డ తర్వాత కూడా సమాదరణ లేకపోగా ఇంకా హైదరాబాద్ నుంచి ఆశించ డం దానికి పాలకులు ఉప్పు అందించడం బాధాకరం.
ఏపీలో ఊహించగలమా!
ఒక బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు, గద్దర్, అందెశ్రీ, రామదాసు సహా తెలంగాణ వ్య క్తులుగా వివిధ రంగాల్లో పేరు మోసిన మహనీయుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసినప్పటికీ, ఆ విగ్రహాలను కృష్ణా నది ఒడ్డున అమరావతిలో ఊహించడానికి అవకాశాలు ఉన్నాయా అనేది అసలు ఊహించగలమా చెప్పండి.
అసలు ఎందుకు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వా త కూడా తెలంగాణలో వారి విగ్రహాల ప్రతిష్ఠాపన చేయాలనే పట్టుదల ఎందు కు? ఒకవేళ కావాలనుకుంటే ముందుగా వీళ్లకు ఒక చెయ్యి ఆడితేనే మరో చెయ్యి ఆడుతుందన్న సత్యం గ్రహించాల్సిన అవసరముంది. దానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలుపడం దేనికి మంచిది? దేనికి సంకేతం? ఉంటే గింటే వింటే ఓ మహా త్మా, ఓ మహర్షీ.. మా పాలకులకు నువ్వు నా చెప్పవయ్యా ! మంచి తెలంగాణ సో యిని బుద్ధిని ప్రసాదించవయ్యా తండ్రీ!!
పుణ్యస్నానం జరిగినా..
అయ్యా! తమరికి పై విషయాలన్నీ తెలియవు అని కాదు. మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకువస్తున్నాను. ప్రతిసారీ ప్రతి దాన్ని రాజకీయ భూతద్దంలో పెట్టి చూడవద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నా. గ తంలో అపూర్వంగా జరిగిన సాగరహారం మిలియన్ మార్చ్‌లో తెలంగాణ ట్యాంక్ బండ్ మీది విగ్రహాలు, ప్రజల ఆగ్రహానికి లోనై హుస్సేన్ సాగర్‌లో మునిగి పుణ్యస్నానం చేసిన విషయం మీకూ తెలిసిందే. బంగారు తెలంగాణ అర్థ తాత్పర్యాలను ప్రజలకు చెప్పి ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నది..
ముఖ్యమంత్రి వర్యా! ఇం దుకోసమైతే కాదు సుమా !!. రెండు కళ్ల సిద్ధాంతానికి, ఇక పాలు మనమే, పటువ మనదనే వాదానికి కాలం రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పుడే చెల్లిపోయింది సార్. ఇకనైనా ఈ వాదాలు, వివాదాలకు ఒక ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నా ను. ఇప్పటికైనా ప్రభుత్వం మెమో ద్వారా జారీచేసిన నిర్దేశాలను ఉపసంహరించుకొని తెలంగాణ ఆత్మగౌరవానికి, ఆత్మాభి మానానికి, అస్తిత్వానికి పట్టం కట్టేలా సరైన నిర్ణయం తీసుకోవాలని, తీసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను.
వ్యాసకర్త: అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు