20-11-2024 12:00:00 AM
తెలంగాణ ధాన్యం దిగుబడిలో మరోసారి రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడం ద్వారా ఈ రికార్డు సృష్టించారని, ఇదంతా రాష్ట్ర రైతుల కృషి ఫలితమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఏడాది కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకపోయినప్పటికీ రాష్ట్రం రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించిందని, పదేళ్ల ప్రత్యేక తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇది ఒక రికార్డని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వారన్నట్లుగా ఇది నిజంగా తెలంగాణ రైతులు గర్వించదగ్గ విషయమే. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియని స్థితిలో బోరుబావుల కింద సేద్యం సాగే రాష్ట్రంలో ఇప్పుడు ఈ స్థాయిలో ఉత్పత్తి జరగడానికి కారణాలేమిటని పరిశీలిస్తే అనేక అంశాలు ఇందుకు దోహదపడ్డాయని అర్థం అవుతుంది.
సన్నవడ్లకు రాష్ట్రప్రభుత్వం కనీస మద్దతు ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించడం ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున సన్నవరి సాగు వైపు మొగ్గు చూపారు. దొడ్డురకం వరి సాగు విస్తీర్ణం తగ్గడమే దీనికి నిదర్శనం. ప్రారంభంలో సరిగా వర్షాలు కురవకపోయినప్పటికీ ఆ తర్వాత పుష్కలంగా వానలు కురవడం, ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడంతో సాగునీటి ఇబ్బందులు లేకపోవడం మరో కారణం.
ఇటీవల అకాల వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పంటకు కాస్త నష్టం వచ్చినప్పటికీ మిగతా ప్రాంతాల్లో ఆ ప్రభావం పెద్దగా లేదు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ధాన్యం సేకరణకోసం కోతలు మొదలు కావడానికి ముందే ప్రణాళికలు సిద్ధం చేసి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఎక్కడా సేకరణ విషయంలో ఇబ్బందులు రాలేదు.
నిజానికి గత అయిదేళ్లుగా రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణంతో పాటుగా దిగుబడి కూడా పెరుగుతూ వస్తోంది. 2019 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర రైతులు 40.41లక్ష ఎకరాల్లో వరిసాగు చేసి 89.76 లక్షల టన్నుల ధాన్యం పండించారు. 2020 ఖరీఫ్ సీజన్ నాటికి వరిసాగు విస్తీరం 52.5 లక్షల ఎకరాలకు పెరగ్గా, దిగుబడి 96.27 లక్షల టన్నులకు చేరింది. ఇలా ప్రతి ఏటా వరిసాగు విస్త్తీర్ణంతో పాటుగా దిగుబడి కూడా పెరుగుతూ గత ఏడాది ఖరీఫ్‌లో 65.9 లక్షల ఎకరాల్లో సాగు, కోటీ 44 లక్షల టన్నులకు పైగా దిగుబడికి చేరింది.
అయితే కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు రాకపోయినా తెలంగాణలో వరిసాగు ఇంత భారీగా పెరగడానికి కారణాలు లేకపోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు లాంటివి నిండడంతో పాటుగా భూగర్భ జలమట్టాలు కూడా గణనీయంగా పెరిగాయి. పదేళ్ల క్రితం దాకా అంటే తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రైతాంగం బోరుబావుల వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడే వారు. అయితే ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు సరికదా బోరుబావుల సంఖ్య పెరిగింది.
2014లో రాష్ట్రంలో 19 లక్షల బోరుబావులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 26.97 లక్షలకు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఒక్కటే. అప్పట్లో ఒక బోరు బావి కింద మూడు ఎకరాలు సాగు చేయడం కష్టంగా ఉంటే ఇప్పడు రెట్టింపు సాగు చేస్తున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటుగా భూగర్భజలాలు పెరగడం ఇందుకు కారణాలు.
కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను మారుస్తామని గతంలో కేసీఆర్ చెప్పిన మాట హామీగానే ఉండిపోయిన నేపథ్యంలో రైతులు ఇప్పటికీ భూగర్భ జలాలు, బోరుబావులనే నమ్ముకోవడం గమనార్హం. అధికార, ప్రతిపక్షాల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ రైతన్న అందుబాటులో ఉన్న జలాలతో సిరులు పండించడం గర్వకారణం. రాబోయే రోజుల్లో వారు ఇంకెన్ని రికార్డులు సృషిస్తారో చూడాలి.