05-05-2025 12:03:50 AM
నల్లగొండ, మే 4 (విజయక్రాంతి) : వరిపంట సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
గత సీజన్లో 66.70 లక్షల ఎఖరాల్లో 153.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగా, ఈ రబీ సీజన్లో 55 లక్షల ఎకరాల్లో 127 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించామన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశామన్నారు.
సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక మార్పు అని, 80 శాతానికి పైగా జనాభాకు ఉచితంగా ప్రతి మనిషికి 6 కిలోల సన్నబి య్యాన్ని ఇస్తున్నామన్నారు. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ వ్యాపారానికి ఉపయోగపడేదని, జనాలు తినడానికి ఉప యోగపడలేదని చెప్పారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ధర్మారెడ్డి, పిల్లాయి పల్లి, బ్రాహ్మణ వెల్యంలో వంటి కాలువలను సైతం పూర్తి చేయలేదన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి పనులు చేపట్టామన్నారు. బ్రాహ్మణ వెల్లేంల ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అత్యధికంగా రూ.1700 కోట్లు కేటాయించామని తెలిపారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రోడ్లపై రూ.150 కోట్లు ఖర్చు పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని, అలాగే మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి జూలైలో రహదారుల నిర్మించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌకధర దుకాణాల పోస్టులన్నింటిని వెంటనే భర్తీ చేయాలని, 15 రోజుల పాటు సన్నబియ్యం అమ్మేలా చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రికి ఆయన సూచించారు.
ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు కేటాయించాలి : మండలి చైర్మన్ గుత్తా
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద నిర్వహణ కోసం నిధులు కేటాయించాలన్నారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, శివన్నగూడెం కింద కిష్టాపురం వరకు కాలువలను పొడగించినట్లయితే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి సాగునీరు అందుతుందని తెలిపారు.
ఎస్‌ఎల్బీసీ లైనింగ్కు రూ.442 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, అయితే రాను న్న కాలంలో ఎస్‌ఎల్బీసీ సొరంగం పనులు పూర్తయితే, ఉదయ సముద్రం కింద ఆయకట్టు పెరగడం వల్ల మొత్తం సుమారు మూడు లక్షలకు పైగా ఆయకట్టు పెరగనున్న దృష్ట్యా కాలువ లైనింగ్తో పాటు, కాలువలను వెడల్పు చేయాలని, తర్వాత లైనింగ్ పూర్తి చేయాలని సూచించారు.
పౌరసరఫరాల్లో భాగంగా ఆంధ్ర నుండి వస్తున్న ధాన్యాన్ని నియంత్రించాలని, ఖమ్మం నుంచి ధాన్యం ఎక్కువగా వస్తున్నదని, అక్కడి నుండి ధాన్యం రాకుండా చూడాలని కోరారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యా న్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడే ఆస్కారం ఉందన్నారు.
సమీక్షా సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయ వీర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీనివాసరావు, అహ్మద్ హుస్సేన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.