18-09-2025 12:35:11 AM
తూప్రాన్,(విజయక్రాంతి): హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారని తూప్రాన్ మండలం దాతర్ పల్లి సాంఘిక సంక్షేమ యువకుడు కొలిచెలిమే లక్ష్మణ్ తెలిపారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగు బాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామిక వాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామ పోరాటమది.
హైదరాబాదు సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ మహారాష్ట్ర, బీదర్ కర్ణాటక ప్రాంతాలు ఉండేవి, 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించు కోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు