10-11-2025 01:25:11 AM
చైర్మన్‌గా శరత్ మరార్
హైదరాబాద్, నవంబర్ 9(విజయక్రాంతి) : 2024 తెలంగాణ టెలివిజన్ అవార్డుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా శరత్ మరార్‌ను నియమించింది. తెలంగాణ ప్రభుత్వం టెలివిజన్ రంగంలో ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు తెలంగాణ టెలివిజన్ అవారడ్స్ 2024 నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
15 మంది సభ్యుల కమిటీకి టీజీఎఫ్‌డీసీ ఎండీ కన్వీనర్‌గా ఉంటారు. నిర్మాత శరత్ మరార్ చైర్మన్‌గా, టెలివిజన్ పరిశ్రమ నుంచి కె.బాపినీడు, మంజుల నాయుడు, పి.కిరణ్ సహా ప్రముఖ సభ్యులుగా ఉంటారు. అన్ని విభాగాలలో పారదర్శకత, సమగ్రత, సృజనాత్మక నైపుణ్యాన్ని నిర్ధారించడానికి అవార్డుల ఫ్రేమ్ వర్క్, విజన్‌ని రూపొందించే బాధ్యతను ప్యానెల్‌కు అప్పగించారు.
ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రతిభా ప్రదర్శనకు కేంద్రంగా ఎదుగుతోందన్నారు. ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ ద్వారా స్థానిక సృజనాత్మక ప్రతిభను గౌరవించే వేదికను అందిస్తున్నామని తెలిపారు. ఇది సృజనాత్మకతను, స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ విధంగా చలనచిత్రం, టెలివిజన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎకోసిస్టంను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.