calender_icon.png 14 July, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు బతుకుదెరువు కాదు.. బతుకు!

30-08-2024 12:00:00 AM

దివంగత నటుడు జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్‌గా నటించనుంది. వైవీఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టును న్యూ టాలెంట్ రోర్స్ ఏ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం, అక్కినేని నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకొని మేకర్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. “నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం.

తెలుగు భాషా దినోత్సవం రోజు ఈ వేడుక జరుపుకోవటం ముఖ్య ఉద్దేశం.. 1980 నేపథ్యపు కథతో సినిమాను ప్రకటించడమే! తెలుగు భాష, సంస్కృతి, విలువల గురించి చెప్పే ఈ సినిమా తెలుగు భాషకిస్తున్న ఓ జ్ఞాపిక” అన్నారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘తెలుగు భాషలో మాధుర్యం, సౌందర్యం చాటి చెప్పేలా ఎందరో కవులు చక్కని పాటలు రాశారు. ఈ సినిమాలో మరింత అందమైన అర్థవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతోంది’ అన్నారు.

డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘తెలుగు భాష బతుకుదెరువు కాదు బతుకు. తెలుగంటే అమ్మ. అమ్మ పని చేయలేదని బయటికి పంపేద్దామంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. పద్యం తెలుగుకే సొంతం’ అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. ‘సమాజంలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు తెలుగు నేర్పించండి’ అని కోరారు. కార్యక్రమంలో గీత, రమేశ్ అత్తిలి తదితరులు పాల్గొన్నారు.