30-08-2024 12:00:00 AM
బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఆ చిత్ర పరిశ్రమనుద్దేశించి కీలక ఆరోపణలు చేశారు. ఆ పరిశ్రమలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న కొందరు నేరస్థులకు ఏమాత్రం తీసిపోరంటూ ఆమె తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పా రు. ‘బెంగాలీ చిత్ర పరిశ్రమలో నాకు ఎదురైన సమస్యల గురించి కొన్నేళ్ల క్రితం ధైర్యం గా బయటకువచ్చి మాట్లాడా ను. కానీ ఎవరూ పట్టించుకోలేదు.. నాకు మద్దతుగా నిలువ లేదు. పైగా నా పరువు మర్యాదలకు భంగం కలిగించి ఇబ్బంది పెట్టాలని చూశారు’ అంటూ శ్రీలేఖ వాపోయారు. ఆమె ఇటీవల మలయాళ దర్శకుడు రంజిత్ గురించి చెప్తూ.. “పలేరి మాణిక్యం’ సినిమా టైమ్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా.
ఆడిషన్స్‌లో భాగంగా దర్శకుడిని కలిశా. సినిమాటోగ్రాఫర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఆయన నా చేతి గాజులను తాకారు. నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. అనంతరం నా మెడపై చేయి వేశారు. దీంతో ఆయన రూమ్ నుంచి వెంటనే బయటకు వచ్చేశా. అప్పుడు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేకపోయా. ఆ రాత్రంతా హోటల్ రూమ్‌లో భయపడుతూ గడిపా. త్వరగా తెల్లవారితే బాగుండనుకున్నా. ఆ ఘటన తర్వాత ఇంటికెళ్లేందుకు నాకు రిటర్న్ టికెట్లు కూడా ఇవ్వలేదు. దీని తర్వాత మలయాళీ ఇండస్ట్రీకి దూరండా ఉండాలని నిర్ణయించుకున్నా” అని ఆరోపించారు.