calender_icon.png 13 July, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేబీఆర్ జంక్షన్లకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలి

13-12-2024 01:20:28 AM

  • సత్వరమే హెచ్‌సిటీ ప్రాజెక్టులను పూర్తి చేయాలి 
  • ఎంఏయూడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం దానకిశోర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న హెచ్‌సిటీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే కార్యాచరణ రూపొందించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.3,500 కోట్లతో చేపట్టనున్న 38 రోడ్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రూ.150 కోట్లతో చేపడుతున్న జంక్షన్ల సుందరీకరణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సందర్భంగా ఎన్‌ఐయూఎం లో గురువారం జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ జాయింట్ సీపీ తదితర అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ హెచ్ సీటీ ఫేజ్ భాగంగా రూ.1,230 కోట్లతో చేపట్టే కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లు ఓవర్లు అండర్ పాసుల నిర్మాణానికి టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ ప్రాజెక్టుకు చేయాల్సిన భూసేకరణ, పరిహారంపై నివేదిక అందజేయాలని సూచించారు.

125 ట్రాఫిక్ జంక్షన్లలో అడ్డుగా ఉన్న 4,100 విద్యుత్ పోల్‌లను 3 నెలల్లోగా తరలించి జంక్షన్ల అభివృద్ధి , సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. ఈ సమయంలో అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి సూచించారు. వచ్చే గురువారం మరోసా రి సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, అడిషనల్ సీపీ విశ్వ ప్రసాద్, వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం పెన్షన్ ఆఫీస్ వద్ద అధికారులతో కలిసి దానకిశోర్ విరించి జంక్షన్, పెన్షన్ ఆఫీస్ వద్ద రోడ్డు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విరించి రోడ్డు విస్తరణ, బల్కాపూర్ నాలాపై సిమెంట్ బ్రిడ్జి నిర్మించి రోడ్డు నంబరు 12కు అనుసంధానం చేయాలన్నారు. పెన్షన్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ భారం కాకుండా లింక్ రోడ్డు నిర్మాణంపై సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు.