08-10-2025 12:00:00 AM
రంగారెడ్డి/చేవెళ్ల, అక్టోబర్ 7( విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుండటంతో అన్ని పార్టీల నేతలు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం స్పెషల్ జీవోతో ఇచ్చిన రిజర్వేషన్లను కోర్టు అమలు చేస్తుందా..? పాత విధానం ప్రకారం ముందుకెళ్తామని చెబుతుందా? వాయిదా వేస్తుందా? అనే విషయం బుధవారం తేలనుంది. ఒకవేళ పాత విధానం కొనసాగితే బీసీలకు తీవ్రనష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. అయితే తీర్పు వ్యతిరేకంగా వచ్చినా ప్రభుత్వం ప్లాన్ బీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
50శాతం దాటితే ఏమవుతుంది?
రాజ్యాంగంలోని నిబంధనలు, సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 42 శాతం.. మొత్తం 67 శాతానికి చేరాయి. దీంతో రెడ్డి జాగృతికి చెందిన మాధవ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 27 న విచారణకు స్వీకరించిన కోర్టు ..
అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే ప్రత్యక జీఓ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కనీసం సుప్రీం ఇచ్చిన 3 నెలల గడువు కూడా పట్టించుకోరా అని నిలదీసింది. అనంతరం విచారణ ఈ నెల కి వాయిదా వేసింది. ఇదే అంశంపై వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకు వెళ్లగా హైకోర్టు లో నే తేల్చుకోవాలని పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
రంగారెడ్డి జిల్లాలో రిజర్వేషన్లు
రంగారెడ్డి జిల్లాలో 21 జడ్పీటీసీ స్థానాలలో 3 ఎస్టీలకు, 4 ఎస్సీలకు, 9 బీసీలకు, 5 జనరల్ కేటగిరీకి కేటాయించారు. జడ్పీ చైర్మన్ పీఠం ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. 21 ఎంపీపీ స్థానాలు, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డులు, 230 ఎంపీటీసీ స్థానాలు ప్రభుత్వ జీవో ప్రకారం కేటాయించబడ్డాయి. అయితే రిజర్వేషన్లలో మార్పు జరిగితే రాజకీయ సమీకరణాలు తలకిందులవుతాయి.
ప్రస్తు తం జిల్లా కలెక్టర్ ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం మంచాల, కొత్తూరు (జనరల్) ఫరూక్నగర్ (మహిళా ) ఎస్టీలకు కేటాయించగా, శంకర్పల్లి, చేవెళ్ల(జనరల్) కందు కూరు, షాబాద్ ( మహిళ ) ఎస్సీ సామాజికానికి కేటాయించిగా,బీసీ బిసి లకు కడ్తాల, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, కేశంపేట, మహేశ్వరం (మహిళ)కు, కొందుర్గు, యాచా రం, తలకొండపల్లి, మాడ్గుల మండలాల ను బీసీ జనరల్ కు కేటాయించారు. కాగాఆమనగల్,అబ్దుల్లాపూర్మెట్, చౌదరి గూడెం నందిగామ శంషాబాద్ మండలాలు జనరల్ కు కేటాయించారు.
బీసీలకు తీరని నష్టం?
మాధవరెడ్డి పిటిషన్ పై ప్రభుత్వ జీవోకు అనుకూలంగా కొందరు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఒకవేళ పాత పద్దతి ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వ జీఓకు వ్యతిరేకంగా తీర్పు వస్తే బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అంటే 42 శాతం నుంచి 25 శాతానికి పడిపోనున్నాయి. అంటే బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో 17 శాతం జనరల్ కు కేటాయింటే చాన్స్ ఉంది. ఎస్సీ 15 శాతం , ఎస్టీ 10 శాతం స్థానాలు మాత్రం పదిలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
ప్లాన్ బీకి రెడీ
రిజర్వేషన్లపై అనుకూలంగా తీర్పు రాకపోతే ప్రభుత్వం ప్లాన్ బీ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తే.. జీవోలో ఇచ్చిన రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంటే బీసీలకు 25 శాతంతో పాటు జనరల్ స్థానాల్లో మరో శాతం ఇచ్చి 42 శాతం భర్తీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రిజర్వేషన్లు ఉంటాయా? పోతయా? ఎన్నికలపై ముందుకా..? వెనకకా..? అనేది మరి కొన్ని గంటల్లో తేలనున్నది.