10-10-2025 12:13:35 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా మార్చే లక్ష్యంతో జీహెఎంసీ డబుల్ యాక్షన్ చేపట్టింది. ఓ వైపు నగరాన్ని చెత్తరహితంగా మార్చేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ను ఉధృతం చేయగా, మరోవైపు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రోడ్ సేఫ్టీ డ్రైవ్ ను ముమ్మరం చేసింది. ఈ రెండు కీలక కార్యక్రమాల అమలు తీరుపై జీహెఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాగా నగరాన్ని మరింత పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ఈ నెల 6న ప్రారంభమైన ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ నాలుగో రోజైన గురువారం కూడా ముమ్మరంగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఆర్‌వీకర్ణన్, అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లోనే నగరంలోని 695 కాలనీల్లో ఈ డ్రైవ్‌ను అమలు చేసి, రికార్డు స్థాయిలో 1082.5 మెట్రిక్ టన్నుల చెత్తను, 365 మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
వర్షాలు తగ్గుముఖం పట్టినందున రోడ్ సేఫ్టీ డ్రైవ్‌ను ముమ్మరం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నగరంలో ట్రాఫిక్ జామ్‌లు తలెత్తకుండా ఉండేందుకు, రోడ్లపై ఉన్న గుంతలన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూడ్చివేయాలి అని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ హుకుం జారీ చేశారు.