calender_icon.png 29 October, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుగురు పార్ట్‌టైం టీచర్ల టర్మినేషన్

29-10-2025 12:00:00 AM

  1. గురుకుల విద్యార్థి మృతికి కారకులని విధుల నుంచి తొలగింపు

ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీసు

హుస్నాబాద్, అక్టోబర్ 28 :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సనాదుల వివేక్ (13) అనుమానాస్పద మృతి కేసులో ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు కదిలారు. వి వేక్ మృతికి కారకులైన ఆరుగురు పార్ట్ టైం ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడంలో విఫలమైన ప్రిన్సిపాల్ శ్యామలతకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిజానికి ఈ కేసులో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వారం రోజుల్లో చర్య లు తీసుకోవాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయమై ’విజయక్రాంతి’ దినపత్రికలో వచ్చిన కథనాల ప్రభా వంతో, ఆలస్యంగానైనా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.

* ఏంటీ నిర్లక్ష్యం?

ఈ నెల 7న విద్యార్థి వివేక్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతికి కారణమైన ఆరుగురు పార్ట్ టైం టీచర్లు మనోజ్ కుమార్ (ఫిజికల్ సైన్స్), స్వర్ణలత (బయోసైన్స్), హరీశ్ (కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్), మహేశ్ (మ్యాథమెటిక్స్), రాజయ్య (సోషల్ సైన్స్), తిరుపతి (తెలుగు) ఘటన జరిగిన రోజు, అంతకుముందు రోజు పాఠశాలకు వచ్చినా, తరగతి గదిలోకి వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. వారు తమ విధులను సక్రమంగా నిర్వహించి ఉంటే, తరగతులను పర్యవేక్షించి ఉంటే బహుశా వివేక్ మరణించేవాడు కాదని అధికారులు భావించారు.

ఎస్సీ కమిషన్ ఆదేశాలు..ఆర్డీవో విచారణ

విద్యార్థి మృతిపై దర్యాప్తులో జాప్యం, నిర్లక్ష్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు ఆదేశాలు జారీ చేశా రు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్తో, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి విచారణ జరిపారు. ఆర్డీవో సమర్పించిన నివేదికలో, ఈ ఆరుగురు పార్ట్ టైం టీచర్లు పర్యవేక్షణ లోపానికి కారణమని పేర్కొనడంతో, కలెక్టర్ వారిని తక్షణమే టర్మినేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఉపాధ్యాయులు డ్యూటీని నిర్లక్ష్యం చేసినా, వారిని గాడిన పెట్టడంలో ప్రిన్సిపాల్ శ్యామలత విఫలం కావడంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని, వివేక్ మృతికి సంబంధించిన మిస్టరీని ఛేదించే దిశగా బలమైన అడుగులు వేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దళిత సంఘాలు, వివేక్ కుటుంబ సభ్యుల ఆర్తనాదానికి, విజయక్రాంతి కథనాలకు తలొగ్గి అధికారులు తీసుకున్న ఈ చర్యలు కొంత ఉపశమనం కలిగించినా, మృతి వెనుక ఉన్న వాస్తవాలు, ఇతర కీలక అనుమానాలపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.