11-11-2025 01:47:35 AM
-కశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో దాడులు
-ముగ్గురు డాక్టర్లు సహా ఎనిమిది మంది అరెస్ట్
-విద్యాపరమైన గ్రూప్‌గా ఏర్పడి విధ్వంస రచన
-2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశంలో మరోసారి ఉగ్రదాడిని పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలు జైష్ అన్సార్, ఘజ్వత్ పాటు కశ్మీర్, హర్యానా, యూపీ రాష్ట్రాలకు చెందిన ఉన్మాదులు దేశంలో భారీ ఉగ్రవాద దాడి చేసేందుకు ప్రణాళికలు రచించగా వారి ప్రయత్నాన్ని పోలీసులు పసిగట్టి భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసు దళాలు నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు వైద్యులు సహా, ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి దాదాపు 2900 కిలోల పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు అక్టోబర్ 19న శ్రీనగర్ బన్ పోరా నౌగామ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో పోలీసులు, భద్రతా దళాలను బెదిరిస్తూ జైష్ పోస్టర్లు అతికించారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో పాకిస్థాన్ ఇతర దేశాల నుంచి పని చేస్తున్న విదేశీయ సంబంధాలున్న రాడికలైజ్డ్ నిపుణులు, విద్యార్థులు ఉన్నారు’. అని పోలీసులు తెలిపారు. ప్రొఫెషనల్, అకడమిక్ నెట్‌వర్క్‌ల ద్వారా నిధులు సేకరించి, వాటిని ఎన్ క్రిప్టెడ్ ఛానెల్‌ను ఉపయోగిస్తోంది.
సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో పొఫెషనల్ విద్యా నెట్‌వర్క్‌ల ద్వారా నిధులు సేకరించారు. నిందితులు వ్యక్తులను గుర్తించడం, తీవ్రవాదాన్ని ప్రేరేపించడం, వారిని ఉగ్రవాద ర్యాంక్‌లలో చేర్చుకోవడం, నిధులను సేకరించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు సేకరించడం, ఐఈడీలు తయారు చేయడంలో పాల్గొంటున్నారు’ అని పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రవాదులు విద్యా సంబంధమైన నెట్‌వర్క్‌ను ముఠాగా మార్చుకుందన్నారు. దాతృత్వ కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నామనే తప్పుడు నెపంతో నిధులను సేకరిస్తున్నట్లు తెలిసింది. కాగా జమ్ము కశ్మీర్‌కు చెందిన ఏడుగురు నిందితులు.. అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు జేఅండ్‌కేకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు వీరే..
శ్రీనగర్‌లోని నౌగామ్‌కు చెందిన ఆరిఫ్ నిసార్‌దార్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్, పోషియాన్‌కు చెందిన మౌల్వి ఇర్పాన్ అహ్మద్, గండేర్బల్‌లోని వకూరా ప్రాంతానికి చెందిన జమీర్ అహ్మద్ అహంగర్ అలియాస్ ముత్లాషా, పుల్వామాలోని కోయిల్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్‌గనై అలియాస్ ముసైబ్, కుల్గాంలోని వాన్ పోరా ప్రాంతానికి చెందిన డాక్టర్ అదీల్, డాక్టర్ షాహీన్ లక్నోలో ఉంటున్నారు.
అనుమానాస్పద కార్యకలాపాలపై 15 రోజుల నుంచి పోలీసులు దృష్టి సారించారు. ఇందులో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఫరీదాబాద్‌లోని డాక్టర్ ముజమ్మిల్ గనై, లక్నో మహిళా డాక్టర్ షాహీన్ ఉన్నారు. ఆమె కారులో ఏకే రైఫిల్ లభ్యమైంది. ఆమెను కస్టడీ విచారణ కోసం విమానంలో శ్రీనగర్‌కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే వీరిని ఎప్పుడు అరెస్ట్ చేశారో మాత్రం పోలీసులు కచ్చితమైన వివరాలు అందించలేదు. వీరంతా కలిసి ఐఎస్‌ఐఎస్, జైష్ ఏ మహ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థల తరఫున దాడులకు ప్రణాళిక రచించారు.
పోలీసులకు లభ్యమైన 2900 కిలోల పేలుడు పదార్థంలో అమ్మోనియం నైట్రైట్, పొటాషియం నైట్రేట్, సల్పర్ ఉన్నాయి. వీటిలో కొంతభాగం ఫరీదాబాద్‌లోని డాక్టర్ ముజమ్మిల్ గనై గదికి అద్దెకు తీసుకుని అందులో నిల్వ ఉంచారు.వివిధ ప్రదేశాల్లో దొరికిన వాటిలో చైనీస్ స్టార్ పిస్టల్, మందుగుండు సామగ్రితో కూడిన ఏకే క్రింకోవ్ రైఫిల్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్, బ్యాటరీలు, వైర్లు, రిమోట్ కంట్రోల్, టైమర్లు మెటల్ సీట్లు ఉన్నాయి.గనై, అదిల్ ఫోన్లలో అనేక పాకిస్తానీ నంబర్లు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.