calender_icon.png 27 September, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఫలక్‌నుమా’లో ఉగ్రవాదుల సమాచారం!

27-09-2025 01:36:30 AM

-రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, ప్రత్యేక బృందాలు

-ఘట్‌కేసర్ వద్ద రైలులో విస్తృతంగా సోదాలు

-ప్రతి బోగీలో ప్రయాణికుల లగేజీ క్షుణ్ణంగా తనిఖీ

-ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

ఘట్ కేసర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : కోల్‌కతా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన రైల్వే, స్థానిక పోలీసులు రైలును ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.రైల్వే ప్రొటెక్షన్ ఇంటెలిజెన్స్ నుంచి కోల్‌కతా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నరంటూ సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది రైలును ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ లో ఉదయం 9.50కి నిలిపివేసి అన్ని కంపార్ట్ మెంట్‌లలో స్థానిక పోలీసుల సహాయంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తితో పాటు వెంట ఉన్న బ్యాగేజీలను చెక్ చేశారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ లేకపోవడంతో ప్రయాణికులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ క్రమంలో సందేహాస్పదంగా కనిపించిన వారిని గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారు సైతం వారి వ్యక్తిగత వివరాలు వెల్లడించారు. ఇది ఫేక్ కాల్ అని పోలీసులు ఈ సందర్భంగా నిర్ధారించారు. రైలు నిలిపివేయడంతో అందులోని ప్రయాణికులు ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమారు గంట పాటు సోదాలు చేపట్టిన అనంతరం టెర్రరిస్టులు ఎవరూ లేరని నిర్ధారించాక 10.55 గంటలకు రైలు యథావిధిగా ముందుకు కదిలింది. అనంతరం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా చేరుకుంది.