21-07-2024 09:36:21 PM
హైదరాబాద్: తెలంగాణ ఈసెట్ తుది దశ కౌన్సిలింగ్ పూర్తయింది. చివరి ఫేజ్ కౌన్సిలింగ్ కోసం 14212 మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 9646 మందికి సీట్లు కేటాయించారు. తుది విడత కౌన్సిలింగ్ కోసం ఇంజనీరింగ్‌లో 12785, ఫార్మసీలో 1180 సీట్లు (మొత్తం 13965సీట్లు) ఉండగా... ఇంజనీరింగ్‌లో 2378, ఫార్మసీలో 1133 (మొత్తం 3511 సీట్లు) భర్తీ కాలేదు. ఇంజనీరింగ్‌లో 81.40శాతం సీట్లు భర్తీ కాగా... ఫార్మసీలో కేవలం 3.98 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఫార్మసీలో 1180 సీట్లకు గాను 47 సీట్లు మాత్రమే భర్తీ కాగా... 1133 సీట్లు మిగిలిపోయాయి. బీ ఫార్మసీ కోర్సుకు విద్యార్థుల నుంచి ఆసక్తి కనిపించలేదు. కంప్యూటర్ సైన్స్ సీట్లు 72 శాతం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సీట్లు 98శాతం, సివిల్, మెకానికల్ సీట్లు 98.78 శాతం, ఇతర ఇంజనీరింగ్ కోర్సుల సీట్లు 81 శాతం పూర్తయ్యాయి. కంప్యూటర్ సైన్స్ సీట్లతో పోలిస్తే మిగతా బ్రాంచిల సీట్లు ఎక్కువగా భర్తీ అయ్యాయి. కాగా...కౌన్సిలింగ్‌లో సీట్లు కేటాయించబడిన విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేని ఎడల వారి సీట్లు రద్దవుతాయి.