30-12-2025 01:36:22 AM
రూ.50వేలు జరిమానా
సిద్దిపేట క్రైం, డిసెంబర్ 29 : భూవివాదంలో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానాను కోర్టు విధించింది. నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి సురేందర్ కిరాణా దుకాణం నిర్వహించేవాడు. దుకాణం వద్ద పన్నెండు గంటల భూమి విషయంలో అతడి దాయాది రేకులపల్లి శ్రీనివాస్ తరుచూ గొడవపడేవాడు.
ఈ క్రమంలో మనసులో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ ఇనుప రాడ్ తో సురేందర్ తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఈ విషయమై సురేందర్ కుమారుడు శ్రీనివాస్ రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ ను కోర్టులో హాజరు పరిచారు.
కేసు దర్యాప్తు దశలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేందర్ మృతి చెందాడు. సోమవారం సిద్దిపేట ఒకటో అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి జయప్రసాద్ ఇరుపక్షాల వాదనల అనంతరం నిందితుడు శ్రీనివాస్ పై నేరం రుజువు కావడంతో తుది తీర్పు వెల్లడించారు.