19-11-2025 12:00:00 AM
నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది
వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు
మంథని, నవంబర్ 18(విజయక్రాంతి):హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, -నాగమణి దంపతుల హత్యకేసులో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తమను ప్రోత్సహిస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపించడం నిజం కాదని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు అన్నారు. మంథని డివిజన్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ నేను గత 30 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని, నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి అవగాహన ఉందని అన్నారు.
తన కొడుకు, కోడలును హత్య చేసిన నిందితులను న్యాయపరంగా శిక్షించాలని అన్నారు. ఈ వయసులో తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నిందితులకు శిక్ష పడాలని మొదటి నుంచి పోరాడుతున్నానని,న్యాయం వ్యవస్థపై తమకు నమ్మకం ఉంది కాబట్టే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లిందన్నారు. తమ లాయర్లు మేనక గురుస్వామి, భరత్ కుమార్, చంద్రకాంత్ రెడ్డిల సహకారంతో ఈ కేసును సుప్రీంకోర్టులో వాదించడంతో సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిందని అన్నారు.
ఈ కేసులో నాకు ఏం తెలవదని శ్రీధర్ బాబు అండదండలతో నేను సుప్రీంకోర్టుకు వెళ్లాలని పుట్ట మధు ఆరోపించడం శ్రీధర్ బాబుపై బురద చల్లడమేనన్నారు. ఈ కేసులో తాము రాజీకొస్తే రూ. 100 కోట్లు ఇస్తామని పుట్ట మధు ఉప్పల్ కు చెందిన ఒక న్యాయవాదితో ఆఫర్ పంపాడని కిషన్‌రావు ఆరోపించారు. పుట్ట మధుకు ఈ హత్యతో సంబంధం లేకుంటే తమ కుటుంబాన్ని ఒక్కసారైనా పుట్ట మధు వచ్చి పరామర్శించారా..
అని వామన్ రావు తమ్ముడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఇకమీదట సంబంధం లేని మంత్రి శ్రీధర్ బాబును విమర్శిస్తే న్యాయపరంగా పోరాడుతామన్నారు. న్యాయ వ్యవస్థ పై తమ కుటుంబానికి నమ్మకం ఉందని తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా, తన కొడుకును, కోడలును పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితులకు సుప్రీంకోర్టులో శిక్ష పడే వరకు ఇలాగే పోరాడుతామని వారు తెలిపారు.