calender_icon.png 8 January, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా చెరలో మదురో

05-01-2026 12:00:00 AM

న్యూయార్క్ జైలులో ఖైదు

మాదక ద్రవ్యాల రవాణా, ఆయుధాల చట్టం కింద కేసులు

నేడు మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్న అమెరికన్ యంత్రాంగం

న్యూయార్క్/కరాకస్, జనవరి 4 : వెనుజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఉన్నారు. శనివారం తెల్లవారుజామున జరిగిన మెరుపు దాడిలో అమెరికా సైన్యం ఆయనను పట్టుకుంది. మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను ప్రత్యేక విమానంలో న్యూయార్క్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిద్దరినీ బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల చట్టం కింద వీరిపై అమెరికా తీవ్రమైన కేసులు నమోదు చేసింది. సోమవారం మదురోను మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు.

ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో వెనుజులాలో పరిపాలన బాధ్యతలను అమెరికా స్వీకరిస్తుందని అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ప్రకటించారు. అక్కడ పరిస్థితులు చక్కబడే వరకు తమ పర్యవేక్షణలోనే పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఆ దేశంలోని అపారమైన చమురు నిల్వలను ఇతర దేశాలకు విక్రయించే యోచనలో అమెరికా ఉంది. మదురో అరెస్టుతో వెనుజులాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కారకస్‌లో జరిగిన వైమానిక దాడుల్లో సుమారు 40 మంది మరణించినట్లు సమాచారం. అక్కడి విద్యుత్ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తదు పరి పాలన వ్యవహారాలు చూస్తున్నారు.

ఆహారానికీ కటకట

దేశ రాజధాని కరాకస్‌పై అమెరికన్ సైన్యం వైమానిక దాడుల తర్వాత, దేశాధ్యక్షుడు మదురో దంపతులను బంధీలుగా తరలించగా ఆ దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. పౌరులు కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందిపడుతున్నారు. ఆహారం లభించక ఆకలితో విలవిలలాడుతున్నారు. విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినడంతో కారకాస్‌లోని అనేక ప్రాంతాల్లో కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ మార్కెట్లు మూతపడటంతో.. చిన్న దుకాణాల వద్ద ప్రజలు ఆహారం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. దాడి అనంతరం వ్యాపారులు అన్ని సూపర్ మార్కెట్లు మూసేశారు. చిన్న దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వాటి ముందు పొడవైన క్యూలు కన్పిస్తున్నాయి. ప్రతి చోటా 500 నుంచి- 600 మంది వరకు బారులు తీరారు. ఫార్మసీల వద్ద చాలా పెద్ద క్యూలు ఉన్నాయి. ప్రజా రవాణా  నిలిచిపోయింది. భయంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. రోడ్లపై ఉన్న కొన్ని విద్యుత్ దీపాల వద్ద కరెంటు ఉండటంతో.. దాని నుంచి ప్రజలు ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. వారు మౌలిక వసతులన్నింటికీ దూరమయ్యారు.

వెనుజులా ప్రజలకు భారత్ మద్దతు

వెనుజులా పరిస్థితులను పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ దేశంలోని భారతీయులతో  వెనుజులా లోని భారత రాయబార కార్యాలయం సంప్రదిస్తోందని, వారికి సహాయం అందిస్తోందని ఆదివారం తెలిపింది. భారతీయులు కారకాస్‌లోని రాయబార కార్యాలయంతో నిరంతరం కాంటాక్ట్‌లో ఉండాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. వెనుజులా ప్రజల క్షేమం, భద్రత విషయంలో భారత్ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. 

తర్వాత మీరే: ట్రంప్

అమెరికా పత్యర్థి దేశాలైన మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలను సైతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వెనుజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం ట్రంప్ లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదకద్రవ్యాలను తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని లేకపోతే వెనుజులా పరిస్థితే ఆ దేశాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇతర దేశాల నుంచి అమెరికాకు సరఫరా అవుతున్న డ్రగ్స్‌ను కట్టడి చేయడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. 

తాత్కాలిక దేశాధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్

వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ను నియమిస్తున్నట్లు ఆ దేశ సుప్రీం కోర్టు ప్రకటించింది. వెనుజులా రాజధాని కారకాస్‌పై మెరుపుదాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా బంధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ పరిపాలనా కొనసాగింపు, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. అయితే డెల్సీ రోడ్రిగ్స్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మద్దతిస్తున్నట్లు సమాచారం. లిగా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, వామపక్ష గెరిల్లా నాయకుడు జార్జ్ ఆంటోనియో కుమార్తెనే డెల్సీ రోడ్రిగ్స్. 2018లో వెనుజులా ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు.