25-11-2025 08:18:21 PM
మాజీ ఎంపీపీ సమ్మయ్య విమర్శ..
కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం మాజీ సర్పంచ్ తెప్పల దేవేందర్ భార్య లక్ష్మీపై దాడికి పాల్పడడం సిగ్గుచేటని కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, జిల్లా కిసాన్ సేవాదళ్ అధ్యక్షులు వోన్న వంశవర్ధన్ రావు, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, నాయకురాలు ఆంగోతు సుగుణ, కుంభం స్వప్న రెడ్డి, డాక్టర్ సుజాత, గంట లక్ష్మి, కుంభం రమేష్ రెడ్డి, నవీన్ రావు, గద్దె సమ్మిరెడ్డి, భూపెళ్లి రాజు తదితరులు అన్నారు. మంగళవారం వారు గంగారంలో గల దేవేందర్ నివాసానికి వెళ్లి లక్ష్మీని పరామర్శించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.
గంగారం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీలో నాయకుడిగా చెప్పుకు తిరుగుతున్న సల్లా శేఖర్ అనే వ్యక్తి రాజకీయ దురుద్దేశంతో మహిళపై దాడికి పాల్పడడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలే తప్ప, భౌతిక దాడులకు పాల్పడడం సమంజసం కాదని వారు హితవు పలికారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బిఆర్ఎస్ నాయకులు అల్లర్లను సృష్టించడం, మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబు, దుద్దిళ్ళ కుటుంబాలపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇకముందు దుద్దిళ్ల కుటుంబంపై, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ ఎదురుదాడికి సిద్ధమని వారు సవాల్ చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా, దుద్దిల్ల సోదరుల మార్గదర్శకాల మేరకు, ప్రజోపయోగ కార్యకలాపాలలో పాల్గొనడం, ప్రజల మధ్యలో ఉండటం కాంగ్రెస్ పార్టీ విధానంగా వారు పేర్కొన్నారు.