06-10-2025 12:00:00 AM
సాధారణంగా ఏ శైవక్షేత్రంలో చూసినా ఒక శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది. కానీ ఒక్క మణుగూరులోని నీలకంఠేశ్వర ఆలయంలో మాత్రమే రెండు శివలింగాలు దర్శనం ఇస్తాయి. అవే ఒకటి పాతాల లింగేశ్వరుడు స్తూపాకారంలో, నీలకంఠేశ్వరుడు బాణాకారంలో భక్తులకు దర్శనమిస్తాడు. భూగర్భంలో భక్తులకు కనిపించేలా పాతాల లింగేశ్వరుడు ఉంటాడు. ఈ లింగాకారం అందరికీ కనిపించినా ఆర్చకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అలాగే పైన నీలకంఠేశ్వరుడు ఉంటాడు. రెండు లింగాలకు రాగి తీగలతో అనుసంధానం చేశారు. దీంతో పైన ఉన్న స్వామికి భక్తులు అభిషేకం చేయడం ద్వారా..పాతాళంలోని లింగేశ్వరుడికి కూడా పూజలు చేసినట్లేనని నమ్ముతారు. ఇలా ద్విలింగాలు దర్శనమిచ్చే ఆలయాలు. దేశంలో రెండే ఉండగా, ఒకటి ఉజ్జయినీ మహంకాళి ఆలయమని, రెండోది మణుగూరులోనే ఉండడం విశేషం.
తెలుగు వారికి స్వర్ణయుగాన్ని తెచ్చిన కాకతీయ చరిత్రకు నేటికి కీర్తి కిరీటమై, నాటి కాలపు సజీవజ్ఞాపకంగా నిలుస్తోంది.. మణుగూరులోని నీలకంఠేశ్వర ఆలయం . ఒకప్పుడు కాకతీయ రాజవంశంతో పూజలందుకున్న నీలకంటేశ్వర ఆలయం, ఢిల్లీ సుల్తాన్‌ల దండయాత్రలతో ధ్వంసమై, కాలగర్భంలో కలిసిపోయింది. వెయ్యి సంవత్సరాలకు పైగా భూగర్భంలో మరుగున పడిన ఆలయానికి కొన్నేళ్ల క్రితం భక్తులు తిరిగి పునరుజ్జీవం పోశారు. దీంతో ఈఆలయంలో నీలకంఠేశ్వరుడు ఒకే పానవట్టం మీద లింగరూపులై అభిషేకాలు, పూజలు అందుకొంటున్నారు.
కాలగర్భంలోంచి పునరుజ్జీవం..
శివలింగాపురం గ్రామంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని క్రీ.శ. 1162లో నిర్మాణం చేశారు. కాకతీయలతో పూజలు అందుకున్న ఆలయాన్ని ఢిల్లీ సుల్తానుల కాలంలో పూర్తిగా ధ్వంసం చేసి ఆలయ రూపురేఖలు లేకుండా ఏనుగులతో తొక్కించడంతో పూజ కైంకర్యాలు లేకుండా వెయ్యి సంవత్సరాలకుపైగా కాలగర్భంలో కలిసి పోయింది.
70 ఏళ్ల క్రితం గ్రామానికి భిక్షాటన కోసం వచ్చిన ఓ సాధువు గ్రామంలోని మర్రి చెట్టు క్రింద విశ్రమించగా స్వప్నంలో పరమశివుడు కనిపించి గ్రామానికి సమీపంలో మర్రిచెట్టు కింద కొలువు తీరానని చెప్పడం తో ఆయన నాటి గ్రామ పెద్దలతో కలిసి అక్కడికి వెళ్లి మట్టిని కదిలించగా, శివుని లింగాకారం బయటపడింది.
దీంతో నాటి గ్రామ పెద్దలు మళ్లీ లాలయ్య, పూజారి తాతయ్య, గ్రామస్తులు, భక్తులతో కలిసి భూ గర్భంలో పానవట్టం పై స్తూపాకారంలో ఉన్న లింగాన్ని మరోచోట ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదట. దీంతో గ్రామస్తులు యథాస్థానంలో ఆలయాన్ని నిర్మించారు. భూగర్భంలో భూతాల లింగేశ్వరుడు, స్తూపాకారంలో, నీలకంఠేశ్వరుడు దేదీప్యమానంగా భక్తుల కోరిన కోర్కెలను తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు.
భక్తుల విశేష పూజలు
కాకతీయుల కాలం నాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో మహా శివరాత్రి, కార్తీక మాసాల్లో విశేషాపూజలు, హోమాలు జరుగుతాయి. శివరాత్రికి ముందుగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవం,రథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారికి కల్యాణం వీక్షించి, నీలకంఠేశ్వరుడిని కొలిచేందుకు వేలాది మంది భక్తులు బారులుదీరుతారు.
ఏటా ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు శివరాత్రి ఉత్సవాల సమయంలో తరలివస్తారు. మనస్ఫూర్తిగా, నియమనిష్టలతో పూజలు చేస్తే వరమశివుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.
మణుగూరు, విజయక్రాంతి