03-12-2025 12:00:00 AM
-చరిత్ర సృష్టించిన వైభవ్
-సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో శతకం
కోల్‌కత్తా, డిసెంబర్ 2 : భారత క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది. 2025 ఐపీఎల్ సీజ న్ నుంచి మొదలైన పరుగుల వరదకు ఇప్ప ట్లో బ్రేక్ పడేలా లేదు. దాదాపు ఆడుతున్న ప్రతీ సిరీస్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో శతక్కొట్టాడు.
మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో సెం చరీ సాధించి చరిత్ర సృష్టించాడు. 61 బంతు ల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. తద్వారా ఈ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వైభవ్ 12 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేశాడు. 2013లో మహారాష్ట్ర బ్యాటర్ విజ య్ జోల్ 18 ఏళ్ల 118 రోజుల వయసులో శతకం సాధిస్తే.. వైభవ్ 14 ఏళ్ళ 250 రో జుల వయసులో ఈ ఫీట్ సాధించాడు.
ఈ జాబితాలో వైభవ్ సూర్యవంశీ తర్వాత ఆయుశ్ మాత్రే, షేక్ రషీద్ ఉన్నారు. ఇదిలా ఉంటే భారత్ తరపున టీ20ల్లో మూడు సెం చరీలు చేసిన అతి పిన్న వయస్కుడిగానూ వైభవ్ రికార్డు సృష్టించాడు.ఈ క్రమంలో తిలక్ వర్మ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశా డు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో శతకం సాధించిన వైభవ్ ఇటీవల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ ఏ జట్టు తరపున 32 బం తుల్లోనే సెంచరీ చేశాడు. ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ శతకం సాధించాడు. దీంతో టీ20ల్లో ఒకే ఏడాది మూడు సెంచరీలు చేసిన 16వ బ్యాటర్‌గా నిలిచాడు.