16-07-2025 12:17:07 AM
- అల్వాల్ లో రసాభాసగా మారిన చెక్కుల పంపిణీ కార్యక్రమం
- ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎదుటే కొట్టుకున్న రెండు పార్టీల నాయకులు
మేడ్చల్, జూలై 15 (విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ లో మంగళవారం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నాయకులు ఘర్షణ పడ్డారు. బోనాల సందర్భంగా ఆలయాలకు నిధులు మంజూరు అయ్యాయి. వీటిని పంపిణీ చేయడానికి బాలాజీ వెంకటేశ్వర మందిరంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. అధికారిక కార్యక్రమం అయినందున ప్రోటోకాల్ పాటించడం లేదని, బీఆర్‌ఎస్ నాయకులకు వేసిన కుర్చీలలో కాంగ్రెస్ నాయకులు కూర్చున్నారని వివాదం మొదలైంది. వివాదం పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకున్నారు.
పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చదరగొట్టారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో చెక్కుల పంపిణీ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాంగ్రెస్ నాయకులు గుండాయిజం, ఆడ మగ తేడా లేకుండా దౌర్జన్యం చేశారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సవిత అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత రాము యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ మహిళలని చూడకుండా తమపై దౌర్జన్యం చేశారని, సూచించారని అన్నారు. దీనంతటికీ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీకాంత్ రెడ్డి కారణమని తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.