16-07-2025 12:18:28 AM
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, జూలై 15 ( విజయ క్రాంతి ):సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పని చేసే ప్రతి ఒక్క అధికారి, ప్రభుత్వ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మిక శాఖ, జిల్లా ఖజానా కార్యాలయం, భోజన శాల, కలెక్టరేట్ రెవెన్యూ విభాగం, ముఖ్య ప్రణాళిక అధికారి, ఉపాధి అధికారి, టూరిజం, డిఆర్డీవో, టౌన్ ప్లానింగ్, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ, భూ సేకరణ విభాగం, ఏడి డ్రగ్స్ కంట్రోల్, ఏడి మైన్స్, భూ సేకరణ, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాలను, రికార్డు రూములను, ఓపెన్ లాంజ్, టాయిలెట్స్, క్యాంటీన్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల భోజనశాల గదిలో త్రాగునీరు సౌకర్యం కల్పిం చాలని, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కార్యాలయాల్లో ప్రతి ఫైల్ పకడ్బందీగా రికార్డు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయ తనిఖీ లో భా గంగా విద్యా శాఖ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ గా తీసుకొని వంద శాతం అక్షరాస్యత సాధన దిశగా చర్యలు తీసుకోవాలని,
ప్రతి ఒక్కరూ 10వ తరగతి ఓపెన్ స్కూల్ ద్వారా ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి, సంపూర్ణ అక్షరాస్యత మండలంగా ప్రకటించేలా కార్యాచరణ చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి తదితరులు పాల్గొన్నారు.