కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి
- సపోటా పండ్లలో ఎలుకల మందు కలిపి తినిపించి, తాను తాగి ఆత్మహత్యాయత్నం
- కూతురి మృతి, తండ్రి పరిస్థితి విషమం
సంస్థాన్ నారాయణపూర్, మార్చి 24 (విజయక్రాంతి): కన్న కూతురు భవిష్యత్తుకు భరోసాగా నిలవాల్సిన తండ్రే చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లక్ష్మమ్మగూడెం గ్రామానికి చెంది న వరికుప్పల రవికి మాడుగుల గ్రామానికి చెందిన స్వాతితో నాలుగేండ్ల క్రితం వివా హం అయ్యింది. వారికి ఇద్దరు కూతుళ్లు మేఘన (2), మయూరి (9 నెలలు) ఉన్నారు.
గతకొద్ది కాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో మయూరిని తీసుకొని స్వాతి పుట్టింటి దగ్గరే ఉంటుంది. మేఘన రవితో ఉంటుంది. మేఘనను తన వద్దకు పంపించాలని స్వాతి పెద్దల సహా యంతో కోరింది. రవి వినకపోవడం తో పోలీసులను ఆ శ్రయించింది. రవిని పిలిచి పెద్దమను షుల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సూచించారు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఘాతుకానికి తెగించాడు.
మేఘనకు మంగళవారం సపోటా పండ్లలో ఎలుకల మందును కలిపి తినిపించి, తాను ఎలుకల మందు, నిద్ర మాత్రలు నీళ్లలో కలుపుకొని తాగేశాడు. అపరస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రికి, రవిని నల్లగొండ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మేఘన మృతి చెందగా, రవి ఆరోగ్యం విషమంగా ఉంది. స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు




