26-12-2025 12:52:42 AM
అప్పటికప్పుడు తక్షణ చర్యలకు ఆదేశించిన మంత్రి
మహబూబ్‌నగర్, డిసెంబర్ 25(విజయక్రాంతి): ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు సెలవులు ఉండడంతో విహారయాత్రకు హైదరాబాద్ ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడి ఆస్పత్రి పాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు జాతీయ రహదారి పై బాలానగర్ వద్ద విహారయాత్రకు విద్యార్థులతో స్కూల్ బస్సు బోల్తా పడింది.
ఇదే సమయంలో వనపర్తి పర్యటన కు వెళ్తున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్ ను ఆపి బస్సు దగ్గరికి వెళ్లారు. ప్రమాద స్థలం లో ఆక్సిడెంట్ అయిన కార్ ను మంత్రి స్వయంగా పక్కకు తోశారు. బోల్తా పడ్డ బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీయించారు. హైదరాబాద్ వెళ్లే రహదారి పై భారీగా ట్రాఫిక్ జాం కావడం తో మంత్రి స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. గాయపడ్డ విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు.
ప్రమాదానికి గురై భయ బ్రాంతులకు లోనైన విద్యార్థులకు మంత్రి ధైర్యంచెప్పారు. ఈ ప్రమాదం లో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని షాద్ నగర్ డాక్టర్ లకు ఫోన్ చేసి చెప్పారు. విద్యార్థులకు దగ్గరుండి అన్ని చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేసి విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వడంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్..
బాలానగర్ మండలం కేతి రెడ్డి పల్లి పెట్రోల్ పంపు వద్ద జరిగిన బస్సు బోల్తా పడిన ప్రమాదంలో గాయాల పాలైన షాద్ నగర్ బుగ్గా రెడ్డి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గురువారం పరామర్శించి విద్యార్థులతో మాట్లాడారు.వైద్యులతో మాట్లాడి వారికి చికిత్స అందించాలని కోరారు. మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్,ఆర్.టి.ఓ రఘు లు దగ్గరుండి పర్యవేక్షించారు.
విద్యార్థినిలకు షాద్ నగర్ పట్టణంలో గల బుగ్గారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించి వారికి భోజనం చేయించి పండ్లు అందించి వారి స్వస్థలాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించి వారిని పంపించడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని డాక్టర్లతో నిర్ధారించుకున్న తర్వాత వారిని వారి స్వస్థలాలకు పంపించినట్లు రెవెన్యూ అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు.ఆర్.టి.ఓ రఘు వారికి వాహనం ఏర్పాటు చేసి పంపించారు.
బాలానగర్ మండలం లోని మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తా వద్ద సర్ఫ్ కంపెనీ సమీపంలో శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైందని సంబంధిత అధికారులు తెలిపారు. నారాయణపేట జిల్లా మరికల్ గ్రామానికి చెందిన మణికంఠ ప్రైవేటు కళాశాల విద్యార్థులు, అదే గ్రామానికి చెందిన రిషి హై స్కూల్ బస్సులో హైదరాబాద్లోని జలవిహార్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ అదుపు తప్పడంతో బస్సు రోడ్డుపై బోల్తా పడింది. బస్సులో మొత్తం 47 మంది విద్యార్థులు ఉండగా, పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్వల్పంగా గాయపడిన 6 గురు విద్యార్థులను వెంటనే షాద్ నగర్ బుగ్గారెడ్డి తరలించి చికిత్స అందించారు. జిల్లా ఎస్పీ బీ జానకి ఘటన స్థలానికి చేరుకొని అవసరమైన చర్యలు తీసుకున్నారు.