26-01-2026 12:49:31 AM
ఇబ్రహీంపట్నం,జనవరి 25(విజయక్రాంతి): శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులపైనే దుండగులు బరితెగించారు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాహనాల తనిఖీ చేస్తున్న ఎస్‌ఐని కారుతో ఢీకొట్టి, సుమారు 400 మీటర్ల దూరం బాన్పెనే ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో ఎస్‌ఐ మధు ఆధ్వర్యంలో పోలీసులు క్రమబద్ధంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన ఒక కారును ఆపాల్సిందిగా పోలీసులు సంకేతా లు ఇచ్చారు. అయితే, కారు డ్రైవర్ వేగాన్ని తగ్గించకపోగా, నేరుగా రోడ్డుపై ఉన్న ఎస్‌ఐ మధును బలంగా ఢీకొట్టాడు.ఆ ధాటికి ఎస్‌ఐ కారు బాన్పె పడిపోయారు. డ్రైవర్ కారును ఆపకుండా అలాగే వేగంగా ముం దుకు పోనివ్వడంతో, ఎస్‌ఐ ప్రాణభయంతో బానెట్‌ను పట్టుకుని వేలాడారు. సుమారు 400 మీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్లిన అనంతరం, సాయి శరణం రైస్ మిల్లు సమీపంలో ఎస్‌ఐ రోడ్డు పక్కన పడిపోయారు.
కారు పైనుంచి కింద పడటంతో ఎస్‌ఐ మధుకు తీవ్రగాయాలయ్యాయి. తల మరి యు కాళ్లకు దెబ్బలు తగిలినట్లు సమాచారం. వెంటనే సహచర సిబ్బంది ఆయన్ని మాల్లోని పీపుల్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు..ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించారు. జిల్లా వ్యాప్తంగా కమ్యూనికేషన్ సెట్స్ ద్వారా సమాచారాన్ని చేరవేసి నాకాబందీ నిర్వహించారు. కారుతో పరారైన అగంతకుడిని ఇబ్రహీంపట్నం సమీపం లో పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.విధి నిర్వహణలో ఉన్న అధికారిపైనే హత్యాయత్నానికి పాల్పడినందుకు నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నారు.