26-07-2025 12:53:29 AM
బిసి రిజర్వేషన్ల పై కేంద్ర వైఖరి స్పష్టం చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికలకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్, జూలై25(విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విపక్షాల గొంతులు నొక్కే విధంగా అటు పార్లమెంట్ లో ఇటు బయట వ్యవహరిస్తుందని,పదేపదే పార్లమెంటు సమావేశాలను వాయిదాలు వేసి ప్రజా సమస్యలను మాట్లాడకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, ఉపరాష్ట్రపతి విషయంలో కూడా ఆయనను పొమ్మనలేక పొగ పె డుతున్నట్లు కనబడుతుందని, బీసీ రిజర్వేషన్లపై కూడా కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు.
శుక్రవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ అధ్యక్షతన జరిగిందని, ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాలా వెంకటరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి హాజరైనట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు.
ముఖ్యఅతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగించకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తుందని, పార్లమెంటు సమావేశాలను కూడా సక్రమం గా నడప కుండా, పదేపదే వాయిదాలు వేయడం ఏంటని, పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ కగారుపై చర్చ చేయకుండా,
విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా సమావేశాలను వాయిదా వేస్తూ ఉండడాన్ని సిపిఐ తప్పు పడుతుందని, దేశ ఉపరాష్ట్రపతి విషయంలో కూడా ఆయనను ఇరకాటంలో పెట్టేందుకు బిజెపి కుట్ర పండుతుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కో సం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఆర్డినెన్స్ పంపినప్పటికీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయకపోవడం దుర్మార్గమని అన్నారు.
బిసి రిజర్వేషన్ల అంశం తేలకపోవడం మూ లంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధం కావాలని,అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని వార్డుల వారిగా కమిటీలు వేసుకోవాలని చాడ వెంకటరెడ్డి సిపిఐ శ్రేణులకు సూచించారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ రా ష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర దాటినా ఎన్నికలు నిర్వహించక పోవడం దారుణమని,అభివృద్ధి నిలిచిపోయిందని,కేంద్ర నుండి రావలసిన నిధులు కూడా నిలిచి పోయాయని,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి నాయకులు,కార్యకర్తలు సిద్ధం కావాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,అందె స్వామి, బోయిని అశోక్,గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి,బోయిని తిరుపతి,పిట్టల సమ్మయ్య కిన్నెర మల్లవ్వ లుపాల్గొన్నారు.