calender_icon.png 17 September, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కణ్మని పాత్రకు నా మనసులో ప్రత్యేక స్థానముంటుంది

17-09-2025 12:00:00 AM

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి అద్భుతమైన తారాగణం ఉంది. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రికేయులతో పంచుకుంది.

పవన్ కళ్యాణ్‌తో ఓజీ ప్రయాణం గురించి చెప్పండి?

ఓజీతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పవన్ కళ్యాణ్ తో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో మరియు ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో. 

ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు?

మూవీ అనౌన్స్ మెంట్ అయిన తర్వాత డైరెక్టర్ నాకు ఈ కథ వినిపించారు. కథ నాకు చాలా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. నేను పోషించిన కణ్మని పాత్ర చాలా నచ్చింది. పైగా, పవన్ కళ్యాణ్ సినిమా. సుజీత్ డైరెక్టర్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణం. ఇంతకంటే ఏం కావాలి ఈ సినిమా ఒప్పుకోవడానికి.

కణ్మని పాత్ర ఎలా ఉండబోతుంది?

ఇది 1980-90లలో జరిగే కథ. పాత్రను మలిచిన తీరు కానీ, ఆహార్యం కానీ అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మని. 

ఇది యాక్షన్ సినిమా కదా.. ఫ్యామిలీ డ్రామా ఉంటుందా?

ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో యాక్షన్ అనేది ఒక భాగం మాత్రమే. బలమైన కథ ఉంది. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది.

సెట్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడేవారు?

ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడతారు. ఆయన చదివిన కథలు, నవలల గురించి చెప్తారు. చరిత్ర గురించి మాట్లాడతారు. అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువ మాట్లాడతారు. 

షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఏమైనా సూచనలు ఇస్తుంటారా?

సన్నివేశం షూట్ చేయడానికి ముందు దర్శకుడు, నటీనటులతో పవన్ కళ్యాణ్ చర్చిస్తారు. సినిమాకు ఉపయోగపడే పలు గొప్ప సూచనలు ఇస్తుంటారు. నటుడిగా కూడా ఆయన తన పాత్రను చాలా సులభంగా చేస్తుంటారు. పవన్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ సెట్ లో ఎలా ఉన్నారు?

ఇప్పుడు ఆయన చాలా ప్రశాంతంగా, మరింత బాధ్యతగా కనిపిస్తున్నారు. ఎక్కువగా ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం యువత ఎలా ఉన్నారు? రాజకీయాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు చర్చిస్తుంటారు. డిప్యూటీ సీఎం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన తన బాధ్యతను గొప్పగా నిర్వహిస్తున్నారు.

తదుపరి ప్రాజెక్ట్ లు?

తెలుగులో కొన్ని కథ లు వింటున్నాను. అలాగే, వేరే భాషల్లో పలు సినిమాలు చేస్తున్నాను.