calender_icon.png 26 November, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ డ్యాంను బాంబులు పెట్టి కూల్చేశారు

26-11-2025 12:00:00 AM

-మాజీ మంత్రి హరీశ్‌రావు

హుజురాబాద్, నవంబర్ 25(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం తనుగుల గ్రామశివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను ఇసుక మాఫియా బాంబులు పెట్టి కూల్చివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. చెక్ డ్యాం గత వారం ధ్వంసం కాగా, మంగళవారం ఆయన ఘటనాస్థలాన్ని స్వయంగా పరిశీలించారు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చి వేసినట్టు స్పష్టంగా కనిపిస్తుందని, సమీప గ్రామాల రైతులకు భారీశబ్దాలు వినిపించాయని అన్నారు.

ఇప్పటికి వరకు బాధ్యులను గుర్తించకపోవడం, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇసుక మాఫియా అవతారమెత్తారని అన్నారు. ఈ చెక్ డ్యాం నిండా నీళ్లు ఉంటే ఇసుక తీయడానికి ఇబ్బందవుతుందనే పేల్చివేశారని హరీశ్‌రావు ఆరో పించారు. హుస్సేన్ మియా చెక్ డ్యాం పేల్చివేతకు పాల్పడిన దుండగులను రైతులు నిర్భందించి పోలీసులకు అప్పజెప్పారని అన్నారు. పట్టుబడిన వారిలో కాంగ్రెస్ నాయకులు ఉండడంతోనే రైతులే స్వయం గా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. చెక్‌డ్యాం ధ్వంసమై మూడు రోజులైనా చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

నిర్మాణం సరిగా జరగకపోతే నిర్మించి న రాఘవ కన్ స్ట్రక్షన్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎందుకు కాళేశ్వరం మరమ్మత్తులు చేస్తలేరో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ నుంచి మూసీకి ఎలా మళ్లిస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ బ్లాస్టింగ్లు చూస్తుంటే, కాళేశ్వరం వద్ద బాంబులు పెట్టి పేల్చినట్టు ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ధ్వంసంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, ఇసుక మాఫియా  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నాయకులు దీని వెనుక ఉన్నారు కాబట్టే విచారణ జరగడంలేదని అన్నారు. టెర్రరిస్టులు సైతం ఇలాంటి అనైతిక చర్యలకు దిగరని, టెర్రరిస్టుల కంటే కఠినంగా ఇసుకమాఫియా మారిందని దుయ్యబట్టారు. దోషులను శిక్షించి, ఇసుకమాఫియా నుంచి 24 కోట్ల రూపాయలను రికవరీ చేయాలని అన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలోనూ ప్రశ్నిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి, సుంకేర శంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ జెడ్పి చైర్‌పర్సన్ కనుమల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.