06-01-2026 12:00:00 AM
చెక్ పవర్‌తోనే నిధులు డ్రా చేసే అవకాశం
డిజిటల్ ‘కీ’పై రాని స్పష్టత..?
సంగారెడ్డి, జనవరి 5 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఉమ్మడి జిల్లాలో గత నెల 22న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలోని 1590 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, ఉప సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. అయితే వారికి చెక్ పవర్ రావడానికి వేచిచూడాల్సి వచ్చింది. కాగా గత రెండు రోజుల క్రితమే చెక్ పవర్ కల్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
పంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగిసిన వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సుమారు రెండేళ్ల నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంతో డిసెంబర్ 22 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు.
గత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి పేరిట జాయింట్ చెక్ పవర్ ఇచ్చింది. ఆ అధికారాన్ని ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్ పేరిట బదిలీ చేస్తారు. పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను అభివృద్ధి పనులు, ఇతరత్రా ఖర్చులకు డ్రా చేయాలంటే వారి సంతకాలు, ఆధార్, పాన్ కార్డు, ఫోన్ నంబర్, వేలి ముద్రల వివరాలు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో ఈ ప్రక్రియ చేపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇలా..
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. వాటిని డ్రా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్‌ఎంఎస్) అమల్లో ఉంది. నిధులు డ్రా చేసేందుకు డిజిటల్ కీ అవసరం లేకపోయినా గ్రామ పంచాయతీ కార్యదర్శి చెక్కు రాసి సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలను ట్రెజరీ అధికారులకు పంపాల్సి ఉంటుంది. డిజిటల్ సంతకాలు సక్రమంగా ఉంటే బిల్లు పాసవుతుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి..
గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను విడుదల చేస్తోంది. ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి ఆ నిధులు అందుతాయి. పంచాయతీలకు కేటాయించే నిధులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (పీఎఫ్‌ఎంఎస్) అనే ఆన్లైన్ పోర్టల్ను రూపొందించింది. సర్పంచ్, ఉప సర్పంచ్ వేలిముద్రల ఆధారంగా డిజిటల్ ’కీ’ ని తయారు చేస్తారు. ఆ కీని ఉపయోగించి పనులు చేసిన వారి బ్యాంకు ఖాతాల్లోకి నిధులను నేరుగా చెల్లించే సదుపాయం ఉంది.
గతంలో డిజిటల్ కీ తయారీ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించారు. ప్రస్తుతం కీ బాధ్యతను ఏజెన్సీకి అప్పగిస్తారా.. లేక డీపీఎం, ఈ- పంచాయతీ ఆపరేటర్ల ద్వారా అమలు చేస్తారా.. అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఆదేశాలు రాగానే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
చెక్ పవర్ వచ్చింది..
కొత్తగా ఎన్నికైన సర్పంచు, ఉపసర్పంచులకు చెక్ పవర్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే డిజిటల్ కీ ప్రాసెస్ ఇంకా చేయాల్సి ఉంది. మేకర్, చెక్కర్ ప్రక్రియ పూర్తి చేస్తున్నాం.
యాదయ్య, డీపీవో, మెదక్