calender_icon.png 31 December, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి జలద్రోహి!

31-12-2025 12:55:07 AM

సూత్రధారి చంద్రబాబు.. పాత్రధారి రేవంత్‌రెడ్డి

  1. రాష్ట్రానికి నీటి వాటా దక్కకుండా కుట్ర
  2. చంద్రబాబు దాసుడే ఆదిత్యానాథ్ దాస్
  3. బనకచర్లకు అనుమతి వచ్చినా ప్రభుత్వానికి సోయి లేదు
  4. కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : సీఎం రేవంత్ రెడ్డి జల ద్రోహానికి పాల్పడుతున్న ద్రోహి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కత్తి చంద్రబాబుదైనా పొడిచేది రేవంత్ రెడ్డే అని మండిప డ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా జరిగేది తెలంగాణ జల దోపిడీ అని, నల్లమలసాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు.

బనక చర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు. తాము పోరాటం చేస్తున్న సమయంలో  కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో  ఏపీ, తెలంగాణతో మీటింగ్ పెట్టిందని, పోను పోను అనుకుంటూనే బనకచర్ల మీటింగ్‌కు ఉత్తమ్ ఉరికా రని ఎద్దేవా చేశారు. మేం నిలదీస్తే, నిలబెట్టి కడిగేస్తే బనకచర్ల మీటింగ్ ఎజెండాలోనే లేదని, కనుక చర్చ జరిగే ప్రసక్తే లేదని డైలాగులు దంచారని, మేం ఎజెండా బట్టబయ లు చేశామన్నారు.

బనకచర్లను బంద్ పెడుతున్నం అని పేరుకు ఏపీ ప్రకటించిందని, అది కూడా తన ప్రతాపం అని సీఎం, నీళ్ల మంత్రి డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. పోలవరం నుంచి బనకచర్లలో కలప కుండా, పోలవరం నల్లమల సాగర్ కు లింకు చేశారని, గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం, 45:21:14 నిష్పత్తిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ విధంగా కూడా తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్‌కు గోదావరి నీటిని తరలించే పెద్ద కుట్రకు రేవంత్‌రెడ్డి తెరతీశారని ఆరోపించారు. 

బాబు సూచనతోనే దొంగ చేతికి తాళం 

పోలవరం బనకచర్ల విషయంలో కర్ణాటక, మహారాష్ర్టలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాశాయని తెలిపారు. ఈ వాటా తెలంగాణతో సహా ఏ రాష్ట్రానికి దక్కకుండా చేసేందుకు గంపగుత్తగా నీళ్లు తరలించేందుకు పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుకు ఏపీ భారీ స్కెచ్ వేసిందని, ఈ ప్లాన్ కర్ణాటక, మహారాష్ర్టకు అర్థం అయ్యిం ది, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అర్థం కాలేదని మండిపడ్డారు.

చంద్రబాబు సూచించిన వ్యక్తి ఆదిత్యానాథ్ దాస్‌తో రేవంత్‌రెడ్డి కమిటీ వేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఆయనే అని, చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి ఈ ఆదిత్యానాథ్ దాసును నీటి పారుదల శాఖ సలహాదారుడిగా నియమించుకున్నారని ఆరోపించారు. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు చేశారని, రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, జల ద్రోహి కూడా అని విమర్శించారు. 

అనుమతి వచ్చినా సర్కార్ మొద్దునిద్ర

గోదావరి బనకచర్లకు అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చిందని, కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదు, మొద్దు నిద్ర నటిస్తున్న దని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన అనుమతిలో 200 టీఎంసీలు తీసుకుపోయే అవకా శం, వెసులుబాటు ఉందని క్లియర్‌గా చెప్పిందని వివరించారు. ఢిల్లీ మీటింగ్ అయిన 15 రోజులకే బనకచర్లకు అనుమతి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీలో చిల్లర ప్రసంగం కాదు, గోదావరి నల్లమలసాగర్‌కు వ్యతిరేకం అని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేద్దాం రండి అని పిలుపునిచ్చారు.