calender_icon.png 23 December, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిలుకూరు ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి

23-12-2025 02:24:22 AM

  1. కర్ల రాజేష్ లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో వివక్ష
  2. ఎస్‌ఐ సురేష్‌రెడ్డిని కాపాడటంలో ఎమ్మెల్యే ప్రధానపాత్ర 
  3. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి
  4. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
  5. కర్ల రాజేష్ లాకప్‌డెత్‌పై.. హెచ్‌ఆర్సీకి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు

హైదరాబాద్, డిసెంబర్  22 (విజయక్రాంతి) : కొదాడ పట్టణంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్‌ను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని నాలు గు రోజుల పాటు  చిత్రహింసలు పెట్టి.. అత ని లాకప్‌డెత్‌కు కారణమైన చిలుకూరు ఎస్‌ఐ సురేష్‌రెడ్డి, ఇతర  పోలీసులపై చర్య లు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను హెచ్‌ఆర్సీ కి కృష్ణ మాదిగ అందజేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ల రాజేష్ లాక్‌అప్‌డెత్ విషయంలో పోలీసులను సస్పెండ్ చేయడంలోనూ వివక్షత, నిర్ల క్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చట్టం ముందు అందరూ సమానం అనేది నిజమే అయితే.. లాకప్‌డెత్‌లో ఉన్న పాత్రదారులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. మాదిగ కులానికి చెందిన రాజేష్ చనిపోతే.. అందుకు బాధ్యుడైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్ సురేష్‌రెడ్డిని తప్పించి.. బీసీ సామాజిక వర్గానికి చెందిన కోదాడ రూరల్ ఎస్‌ఐ ప్రతాప లింగమ్‌నే సస్పెండ్ చేశారని తెలిపారు.

సురేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుండా కాపాడటంలో కోదాడ ఎమ్మె ల్యే పద్మావతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్ర ప్రధానంగా కనిపిస్తోందన్నారు. ఈ కేసు విషయంలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత కంటితుడుపు చర్యగానే కోదాడ రూరల్ ఎస్‌ఐని సస్పెండ్ చేశారనేది స్పష్టమవుతోందన్నారు. ఇది పూర్తిగా కుల వివక్షతను పాటించడమేనని, ఈ ఘటనకు కోదాడ ఎమ్మెల్యేనే పూర్తి బాధ్యత వహించాలని కృష్ణ మాదిగ అన్నారు. రాజేష్ మృతి ఘటనలో సురేష్‌రెడ్డిని కాపాడటానికి కోదా డ ఎమ్మెల్యే మొదటి నుంచీ ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు.

రాజేష్ మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి గాంధీ ఆసుపత్రికి వేరే ప్రాంతం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ తీసుకొచ్చారని, అంతే కాకుండా పోస్టుమార్టం వీడియో తీయడానికి కోదాడ నుంచే రెడ్డి సామాజిక వర్గం ఫొటో గ్రాఫర్‌ను పిలిపించారని కృష్ణ మాదిగ తెలిపారు. ఎస్‌ఐ సురేష్‌రెడ్డిని కాపాడటానికి ఇదంతా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా జరిగిందని పేర్కొ న్నారు. కోదాడ ఎమ్మెల్యే చనిపోయిన మాదిగ బిడ్డ పక్షాన నిలబడకుండా.. తన రెడ్డి సామాజికవర్గం పక్షానే నిలబడటం ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.

తక్షణమే ఎస్‌ఐని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలో ఉన్న హోంశాఖలో పోలీసుల హింసతో దళితుడు చనిపోతే నెల రోజులుగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఈ నెల 30న కోదాడలో వేలాది మందితో కర్ల రాజేష్ సంతాప సభ నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, కర్ల రాజేష్ తల్లి లలితమ్మ, హైకోర్టు న్యాయవాది దున్న అంబేద్కర్, ఎమ్మార్పీఎస్ నాయకులు బొర్ర బిక్షపతి, ఏపూరి రాజు మాదిగ, రాము మాదిగ, అంజయ్య మాదిగ, టీవీ నరసింహ మాదిగ, బైరపోగు శివకుమార్ మాదిగ, వాట్సప్ రవి మాదిగ, శివ తదిరులు పాల్గొన్నారు.