calender_icon.png 18 January, 2026 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిట్రిక్స్ కొక్కరొకో..?

18-01-2026 12:20:38 AM

సంక్రాంతి.. తెలుగువారింట పండుగ సంబురాలు అంబరాన్ని అందుకునే ఒక సందర్భం. ఆకాశంలో రంగురంగుల పతంగులు.. ఇండ్లల్లో పిండి వంటల ఘుమఘుమలు.. ఆసేతు హిమాచల పర్యంతం తెలుగువారు ఎక్కడున్నా జరుపుకునే పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి సంబురాల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక చీకటి కోణం మరోసారి చర్చనీయాంశమవుతోంది. గత ప్రభుత్వం హయాంలో ఏ అంశాన్ని ‘నైతిక పతనం’గా అభివర్ణించారో.. ఇప్పు డు అదే అంశాన్ని ‘సాంస్కృతిక వారసత్వం’గా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రంగులద్ది చూపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ రెండు నాల్కల తీరు రాజకీయ ద్వంద్వ ప్రమాణాలకు పరాకాష్ట అని విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. కోడి పందాలు.. జూదాల ఏర్పాట్లు క్యాసినోలను తలదన్నే రీతిలో ఉన్న ఏపీ సంక్రాంతి పాలి‘ట్రిక్స్’పై ప్రత్యేక కథనం.. 

కోడి పందాలపై.. రెండు నాల్కలు..!

నాడు నైతిక పతనం.. నేడు సంప్రదాయం

ఏపీలో ‘కోడిపందాల’కు రంగులద్దుతున్న కూటమి ప్రభుత్వం

సాంస్కృతిక వారసత్వం అంటూ చేస్తున్న ప్రచారంపై తీవ్ర విమర్శలు

రైతు సంబురాలను.. జూదరుల అడ్డాగా మార్చుతున్న వైనం

అంతర్జాతీయ క్యాసినోలుగా మార్చాలంటూ సెటైర్లు

దావోస్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు రాబట్టాలంటూ.. నెటిజన్ల వ్యంగ్యోక్తులు

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): 2019 24 మధ్య కాలంలో సంక్రాంతి పండుగ నిర్వహణపై అప్పటి టీడీపీ నేతలు వ్యవహరించిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ నేతల ఆధ్వర్యంలో కోడి పందాలపై అప్పటి ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. వేల కోట్లు చేతులు మారుతున్నాయని, యువత పెడదారి పడుతోందని టీడీపీ, జనసేన నేతలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు హోరెత్తించారు. గుడివాడ, గన్నవరం వంటి ప్రాంతాల్లో ‘క్యాసినో’ సంస్కృతి రాజ్యమేలుతోందని, రాష్ట్రం అరాచకత్వంలో కూరుకుపోతుందని ఆనాడు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.

నేడు మారిన స్వరం..

కానీ.. నేడు సీన్ మారింది. నారా చంద్రబాబు నాయు డు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత సంక్రాంతి సంబురాలు, కోళ్ల పందాల వ్యవహార కథనం పూర్తిగా అడ్డం తిరిగింది. స్వరం మారింది. ఈ ఏడాది సంక్రాంతి వేడుకల్లో జూదం.. గతంలో ఎన్న డూ చూడనంత స్థాయిలో జరిగిందని, తీవ్ర స్థాయికి చేరిందని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలే స్వయంగా ఈ పందాలను పర్యవేక్షించడం గమనార్హం. 

పందాల్లో.. రూ.కోట్లు..

ఈసారి కోళ్ల పందాల్లో రూ.కోట్లు చేతులు మారాయి. గతంతో పోల్చితే పందాల్లో పెట్టే మొత్తం సుమారు పది రెట్లు పెరిగిందని అంచనా వేస్తున్నారు. కోళ్ల పందాల కోసం చేసిన ఏర్పాట్లు చూస్తుంటే.. ఇవన్నీ తాత్కాలిక క్యాసినోలుగా మారాయని చెప్పవచ్చు. జూదాలకు పేరున్న గోవాలో భారీ ఫీజులతో ఎంట్రీ అయినట్టుగానే తాజాగా సంక్రాంతి సంబురాల్లోనూ ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో ఇవి సాగాయనేది అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే.. గ్రామీణ ఆంధ్రా.. ఏపీలో లాస్‌వెగాస్‌ను తలపిస్తున్నాయనే వ్యాఖ్యల్లోని నిజాలకు అద్దంపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా మిన్నకుండిపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి విషయంలో కఠినంగా ఉండే పోలీసులు, రాజకీయ ఒత్తిళ్లతో మౌనంగా ఉండిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. 

సీఎంగా.. చంద్రబాబు వ్యాఖ్యలు..

ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. కోడి పందాలు.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్లో అంతర్భాగమని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల ఆయన చేసిన ప్రసంగంలో.. గ్రామీణ ఉత్సవాల్లో కోడి పందాలకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. ఇవి సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ ద్వంద్వ వైఖరి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం ఈ జూద కార్యక్రమాలు ఆమోదయోగ్యమైనవే అయితే.. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఎందుకనే సూటి ప్రశ్నకు సమాధానం లేదు. ఇది కేవలం రాజకీయ ద్వంద్వ వైఖరేనని భావించాలా.. లేక రాజకీయ సౌలభ్యం కోసం నైతిక ప్రమాణాలను పక్కనపెడుతూ.. తమను తాము మోసం చేసుకుంటున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా యూాటర్న్ ఎంత వరకు సమంజసం అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ పాలనలో చిన్న తప్పిదాలకే నిరంతరం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

వ్యంగ్యోక్తులు..

ఇదిలా ఉండగా.. కోడిపందాలపై గతంలో, ఇప్పుడు జరిగిన సంఘటనలు, చేసిన విమర్శలు, నైతికతను పక్కన పెట్టడంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యంగ్యోక్తులకు దారితీసింది. అంతర్జాతీయ క్యాసినోలుగా ఈ జూదాలను మార్చడానికి గ్లోబల్ టెండర్లు పిలిచి.. వీటిని చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుందని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నించడం గమనార్హం. అలా చేస్తే లాస్‌వెగాస్ వంటి నగరాల నుంచి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి, ఆదాయాన్ని పెంచవచ్చని సెటైర్లు వేస్తున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కృష్ణా నది ఇసుక తిన్నెలపై టెంట్లువేసి జూదం మాత్రమే కాకుండా.. వాటర్ స్పోర్ట్స్, టూరిజం ఆకర్షణలను ఏర్పాటు చేయవచ్చని, పేకాట, కోడిపందాలు, మసాజ్ సెంటర్లను ఏర్పాటుచేస్తే.. రాజకీయ నేతలే ఈ తరహా కార్యక్రమాలకు నాయకత్వం వహించవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వైబ్రంట్ విజయవాడ దసరా, ఆవకాయ అమరావతి వంటి వేడుకలను చూస్తే.. ప్రభుత్వానికి ఇలాంటి భారీ కార్యక్రమాల నిర్వహణపై ఆసక్తి ఉన్నట్టుగా కనపడుతోందని, చురుకైన ఐఏఎస్ అధికారులు, స్థానిక మేధావులు, అంతర్జాతీయ వ్యాపార వర్గాలతో సలహా మండలిని ఏర్పాటుచేస్తే రాష్ట్ర ప్రతిష్ట మరింత పెరుగుతుందని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మరొక్క అడుగు ముందుకు వేసి.. ఈ బృందాన్ని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు తీసుకెళ్లి ప్రపంచ స్థాయి క్యాసినోల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటే.. అమరావతి ఒక్కసారిగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందని అంటున్నారు. అయితే అభివృద్ధి దశలో ఉన్న అమరావతి కాస్తా.. జూద కేంద్రంగా మారే పరిస్థితులు తలెత్తవచ్చని విమర్శకులు హెచ్చరిస్తుండటం గమనార్హం.

అంతటా అసంతృప్తి..

అయితే ప్రభుత్వం, రాజకీయ నేతల తీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జంతు హక్కుల సంఘాలు.. వీటిని నిషేధించాలని డిమాండ్ చేస్తుండగా.. జూదం వల్ల వ్యసనం, అప్పులు, సామాజిక అసమానతలు పెరుగుతాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఇది అభివృద్ధి కాదు. సంప్రదాయం పేరుతో జరుగుతున్న వెనకడుగు మాత్రమే’ అంటూ హైదరాబాద్‌కు చెందిన ఒక సామాజిక శాస్త్రవేత్త వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ పరిశీలించాలి. నిజానికి సంక్రాంతి సంబరాలు ముగుస్తున్న వేళ అసలు ప్రశ్న ఇంకా అలాగే ఉంది. అభివృద్ధి సమస్యలతో పోరాడుతున్న ఏపీ రాష్ట్రంలో.. సాంస్కృతిక విలువలను వక్రీకరించి.. ద్వంద్వ వైఖరితో సమర్థించుకోవడం సరైందేనా.. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదా?.. ఇలాంటి వాటిని ‘పెట్టుబడులు’గా మీరు ఒప్పుకుంటారా అనేది ‘మిమ్మల్ని మీరు’ ప్రశ్నించుకోవాలి.

మీడియా ద్వంద్వ ప్రమాణాలు

రైతు సంబరంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి పండుగను జూదానికి అడ్డాగా మార్చడం దారుణం. గతంలో ఇదే అంశంపై వైసీపీని కడిగిపారేసిన అదే మీడియా.. ఇప్పుడు మాత్రం మౌనం వహించడం విడ్డూరంగా చెప్పవచ్చు. అధికారం మారగానే.. నైతిక విలువలు కూడా మారిపోతాయా? అని ఇప్పుడు సామాన్య ప్రజల ముందున్న ప్రశ్న. ‘సంస్కృతి పేరు తో జూదాన్ని ప్రోత్సహించడం.. చూస్తుంటే.. భావితరాలకు మనం ఏం సందేశాన్ని ఇస్తున్నట్టు. దీనిని పరి శీలిస్తే.. జర్నలిజం అనేది పక్షపాత ధోరణిలో సాగుతుందనే ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. ‘ఇదేనా నిష్పక్షపాత వార్తా కథనం అంటే?’ అని విజయవాడకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లోనూ ఇదే తరహాలో కొనసాగడంతో.. ఈ ద్వంద్వ ప్రమాణాలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.