17-01-2026 02:22:08 AM
నిజామాబాద్, జనవరి 16(విజయ క్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ల్యాబ్, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ రూమ్, తదితర విభాగాలను పరిశీలించారు.
సుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వైద్యులు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషంట్ల వివరాలతో కూడిన రిజిస్టర్ పరిశీలించి, వారికి అందించిన ఔషధాలను గమనించారు. ప్రతి రోజు ఎంత మంది పేషంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
శీతలీకరణలో ఉంచాల్సిన వ్యాక్సిన్లను రిఫ్రిజిరేటర్ లో భద్రపరిచారా లేదా అని తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో నిలువ ఉన్న ఔషధాల గడువు తేదీ, వాటి నాణ్యతను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో విధులు నిర్వహించాలని హితవు పలికారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో. అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.