calender_icon.png 17 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో భక్తజన హోరు

17-01-2026 02:21:51 AM

  1. వనదేవతల దర్శనం కోసం పోటెత్తిన భక్తులు 
  2. శుక్రవారం సుమారు 10 లక్షల మంది రాక

మధ్యాహ్నం రద్దీతో గద్దెల గ్రిల్ బయట నుంచే దర్శనం 

  1. ములుగు నుంచి మేడారం వరకు ట్రాఫిక్ జామ్ 
  2. జంపన్నవాగులో షవర్లు పనిచేయక స్నానానికి ఇబ్బంది
  3. తలనీలాల సమర్పణకూ అవస్థలు
  4. గద్దెల ప్రాంగణంలో ఇంకా అసంపూర్తిగా పనులు

మేడారం, జనవరి 16 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణకు ఇంకా 11 రోజుల గడువు ఉండగానే, సంక్రాంతి వరస సెలవుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కసారిగా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. ఊహించని విధంగా భారీ సంఖ్యలో భక్తులు మేడారం తరలివచ్చారు. వనదేవతల దర్శనం కోసం వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాల్లో భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ములుగు గట్టమ్మ దేవాల యం నుంచి మొదలుకొని పసర, నార్లాపూర్, మేడారం వరకు అడుగడుగునా ట్రా ఫిక్ జాం ఏర్పడింది. ఇంకోవైపు మేడారం పరిసరాలు భక్తులతో నిండిపోవడం వల్ల పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విపరీతమైన రద్దీ పెరగడంతో గద్దెల గ్రిల్ బయట నుంచే భక్తులకు దర్శనం కల్పించారు. జంపన్నవాగులో షవర్లు పనిచేయక పుణ్యస్నానానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. 

సంక్రాంతి పండగ సెలవుల కారణంగా ముందుగానే ఇబ్బంది లేకుండా వనదేవతలను దర్శించుకుని తమ మొక్కులు సమ ర్పించుకోవాలని ఎంతో ఆశతో భక్తులు మేడారం తరలివస్తున్నారు. మేడారానికి భా రీ రద్దీ పెరగడంతో మహాజాతర కోలాహలం కనిపించింది. జంపన్నవాగులో బ్రి డ్జికి ఇరువైపులా కొన్ని షవర్లు మాత్రమే పనిచేయడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానం ఆచరించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే తలనీలాలు సమర్పించుకోవడానికి కూడా అవస్థలు పడ్డారు. మరోవైపు వాహనాల రద్దీ విపరీతంగా పెరగడం, ఇంకోవైపు మేడారం పరిస రాలు భక్తులతో నిండిపోవడం వల్ల పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు తీవ్రంగా శ్ర మించాల్సి వచ్చింది.

సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం వద్ద భక్తుల రద్దీని నియంత్రించడానికి స్వయంగా ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ రంగంలోకి దిగి గేట్లను మూసివేసి, క్యూలైన్లను ఓపెన్ చే యించి భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనానికి చర్యలు చేపట్టారు. ఉదయం పూట రద్దీ తక్కువగా ఉన్న సమయంలో గద్దెల పైకి వెళ్లేందుకు అనుమతించారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో గద్దెల ప్రాంగణం గ్రిల్ బయట నుంచి దర్శ నం కల్పించారు. భక్తులు తమ ఇలవేల్పు దేవతలకు మొక్కులు సమర్పించిన తర్వాత గద్దె నుంచి కొంత తల్లుల ప్రసాదంగా బంగా రం (బెల్లం) తీసుకోవడానికి పోటీపడ్డారు.

ఇక మేడారంలో ప్రైవేటు వాహనాలను ఎక్కడికక్కడే పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపే విధంగా చర్యలు తీసుకున్నారు. ములుగు నుంచి మొదలుకొని మేడారం వరకు ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించారు. సుమారు 10 లక్షల మంది భక్తులు శుక్రవారం మేడారం జాతరకు వచ్చినట్లు అధికారుల వర్గాలు పేర్కొన్నాయి. మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.251 కోట్లతో మాస్టర్ ప్లాన్ పనులు, గద్దెల ప్రాంగణాన్ని అత్యద్భుతంగా శిలా ప్రాకారాలతో నిర్మించడం, మేడారం మహానగరంగా తీర్చిదిద్దడం, విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో ఈసారి మేడారం జాతరకు హాజ రయ్యే భక్తుల సంఖ్య రెండు కోట్లకు మించనుందని అంచనా వేస్తున్నారు.

మేడారం పనులకు అంతరాయం

మేడారం అభివృద్ధి పనులకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తుల రద్దీ అంతరాయాన్ని కలిగిస్తోంది. శుక్రవారం దాదాపు 10 లక్షల మంది భక్తులు తరలిరావడంతో గద్దెల ప్రాంగ ణం భక్తులతో నిండిపోయింది. గద్దెల ప్రాంగణంలో ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇందులో గ్రిల్స్ ఏర్పాటు, ల్యాం డ్ స్కేపింగ్, ఫుల్ కవర్షెడ్ క్యూ లైన్, స్వాగత తోరణాలపై రాతి శిలల ఏర్పాటు పనులు కొన్ని మిగిలిపోయాయి. ఒక్కసారిగా భక్తు లు మేడారం తరలిరావడంతో రద్దీ నియంత్రించేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. గద్దెల ప్రాంగణంలో అమర్చా ల్సిన గ్రిల్స్ భక్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పోలీసులే వాటిని ఎత్తి పక్కన పెట్టారు.

జాతర నిర్వహించడానికి కొన్ని నెలల ముందే పనులు చేపట్టి పూర్తిచేస్తే బాగుండేదని, తీరా జాతర నిర్వహణకు పట్టుమని పది రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ పనులు కొనసాగుతుండటం పట్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ కార్యక్రమంలో చేపట్టిన పనులను ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో ఇంకా పనులు పూర్తికాకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.