calender_icon.png 29 January, 2026 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌లోని చారిత్రక ఆలయాల అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

29-01-2026 12:00:00 AM

హనుమకొండ, జనవరి 28 (విజయ క్రాంతి): వరంగల్ లోని చారిత్రక దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం వరంగల్ కోటలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పురావస్తు మ్యూజియం అభివృద్ధి పనులపై హనుమకొండ లోని కుడా కార్యాలయ సమావేశ మందిరంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఇతర అధికారులతో కలిసి మ్యూజియం అభివృద్ధి, వారసత్వ సంపద పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వరంగల్ పురావస్తు మ్యూజియంను వరంగల్ కోటలో నూతనంగా నిర్మించిన భవనానికి తరలించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

వరంగల్ కోటతో పాటు పరిసర వారసత్వ ప్రాంతాల్లో చేపట్టవలసిన మరమ్మత్తులు, అభివృద్ధి పనుల అంచనాల కోసం కుడా ఇంజనీరింగ్ విభాగం, హెరిటేజ్ శాఖలు సంయుక్తంగా త్వరలోనే స్థల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు.వరంగల్ కోటలోని మ్యూజియం అభివృద్ధి లో భాగంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం, ల్యాండ్స్కేపింగ్, విద్యుత్ సదుపాయాల కల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

అదేవిధంగా వరంగల్ పరిసర ప్రాంతాలైన మొగిలిచర్లలోని ఏకవీర దేవాలయ పునరుద్ధరణ, శాయంపేటలోని పాంచాలరాయ ఆలయ అభివృద్ధి, వరంగల్ కోటలోని శంభుని గుడి పునరుద్ధరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, వారసత్వ పరిరక్షణతో పాటు పర్యాటకాభివృద్ధికి దోహదపడే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కుడా సీఈఓ అజిత్ రెడ్డి, పురావస్తు శాఖ అధికారులు అరవింద్ ఆర్య,వరంగల్ ఆర్డీవో సుమ, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు ఇంచార్జ్ టూరిజం ఆఫీసర్ అనిల్ కుమార్, తహసిల్దార్ శ్రీకాంత్, కుడా ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.