calender_icon.png 30 August, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికే కమిషన్ ఏర్పాటు

30-08-2025 04:37:13 PM

విత్తన ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం

తెలంగాణలో త్వరలో విత్తన చట్టం

విలేకరుల సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రైతుల సమస్యలు పరిష్కరించడానికి రైతు కమిషన్ ఏర్పడిందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి(State Farmers Commission Chairman Kodanda Reddy) తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆదిత్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బత్తాయి రైతుల సమస్యలకు తగు పరిష్కార మార్గాలను చూపి, గిట్టుబాట ధర అందించే దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, దేశంలోని 60 శాతం విత్తనాలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మొక్కజొన్న, వరి, పత్తి విత్తనాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని, ఇక్కడి విత్తనాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రైతు సంక్షేమ పాలన సాగుతోందని, రైతు కమిషన్ ఏర్పాటు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో పంజాబ్ లో మాత్రమే రైతు కూలీల కోసం కమిషన్ ఉండగా, తెలంగాణలోను ప్రత్యేక కమిషన్ ఏర్పాటైందని ఆయన వివరించారు.

మల్టీనేషనల్ కంపెనీలతో రైతుల ఒప్పందాలను కట్టడి చేయడానికి త్వరలో విత్తన చట్టం తీసుకొస్తామని, ఈ విషయంలో రైతు కమిషన్, వ్యవసాయ శాఖ కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. గతంలో వైఎస్ హయాంలో పత్తి విత్తన చట్టం తెచ్చినట్టు, ఇప్పుడు కూడా విత్తన చట్టం రూపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలు విత్తన చట్టం తీసుకొచ్చేందుకు అడ్డుపడుతోందని ఆరోపించారు. రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కె.వి నరసింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, గడుడు గంగాధర్, ఎం సునీల్ కుమార్, రాములు నాయక్, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, మరికంటి భవాని, పాల్గొన్నారు.